గాజువాక : “కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గంలోని బీసీ రోడ్డు అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశానికి ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజు, నియోజకవర్గ పరిశీలకుడు పసుపులేటి బాలరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన పలు హామీలు అమలుకు నోచుకోలేదని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ పనితీరును వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ప్రతిపక్షంగా వైయస్ఆర్‌సీపీ పనిచేస్తోందని, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, వార్డు పరిశీలకులు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు అనుబంధ విభాగాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.