తాడేపల్లి: మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ వైయస్ జగన్ సర్కార్ వరుసగా రెండో ఏడాది వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. మరికాసేపట్లో 1.02 కోట్ల మందికి పైగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.1,109 కోట్లను సీఎం వైయస్ జగన్ జమ చేయనున్నారు. డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీని సీఎం వైయస్ జగన్ ఆన్‌లైన్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో రుణాలు చెల్లించిన అర్హులైన అన్ని సంఘాలకు సున్నావడ్డీకి రుణాలు అందజేయనున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రూ.3 వేల కోట్ల పైచిలుకు అదనపు వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలోని దాదాపు 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 87 లక్షల పైచిలుకు అక్కచెల్లెమ్మలకు బాసటగా నిలిచి.. తొలి ఏడాదిలోనే 2019–20 సంవత్సరానికి సంబంధించిన రుణాలకు వడ్డీ మొత్తం రూ. 1400 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు.