తిరుమల: శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ ను శనివారం మధ్యాహ్నం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు సిద్ధం చేసిన జీడిపప్పు ను స్వయంగా పరిశీలించారు. మూడు కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా ఒక కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పు లో దుమ్ము, విరిగిపోయినవీ చాలా ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు. టీటీడీ షరతు కంటే ఎక్కువగానే దుమ్ము, విరిగిన జీడిపప్పు ఉన్నాయని అధికారులు చైర్మన్ కు వివరించారు. మిగిలిన రెండు కంపెనీలు సరఫరా చేసిన జీడిపప్పు టెండర్ నిబంధన మేరకు నాణ్యతగా ఉన్నట్లు గుర్తించారు. నాణ్యత సరిగాలేని జీడిపప్పు సరఫరా చేసిన సంస్థ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం యాలకులు మూట విప్పించి అవి స్పెసిఫికేషన్స్ మేరకు ఉన్నాయా లేదా అని అధికారులను అడిగారు. వాసన బాగా రావడం లేదని వీటిని ప్రభుత్వ పరీక్ష కేంద్రానికి పంపాలని చైర్మన్ ఆదేశించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యి డబ్బా తెరిపించి నెయ్యి వాసన చూశారు. నెయ్యి వాసన గొప్పగా లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీవారి సేవకులు జీడిపప్పు ను బద్దలుగా మార్చే సేవను ఛైర్మన్ చూశారు. జీడిపప్పు నాణ్యత ఎలా ఉందని, సేవ ఎన్ని రోజులు చేస్తారు, ఎక్కడి నుంచి సేవకు వచ్చారు అని శ్రీవారి సేవకులతో మాట్లాడారు. స్వామివారి ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు ఏటా రూ 500 కోట్లు ఖర్చు చేసి జీడిపప్పు, నెయ్యి, యాలకులు కోనుగోలు చేస్తున్నామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. వీటిలో నాణ్యత లోపిస్తోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆకస్మిక తనిఖీలు చేశానని ఆయన వివరించారు. సరుకులు టీటీడీ ల్యాబ్ లో పరీక్షించడంతో పాటు, సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ కు కూడా పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, డిప్యూటి ఈ ఈ నటేష్ బాబు పాల్గొన్నారు.