మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రజాద్రోహం 

వైయ‌స్ఆర్‌సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఫైర్‌

శ్రీ‌కాకుళంలో ర‌చ్చ‌బండ‌- కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌

శ్రీ‌కాకుళం:  గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహోన్నత ఆశయంలో నెలకొల్పిన మెడికల్‌ కాలేజీలను కూటమి సర్కారు ప్రైవేట్‌ప‌రం చేస్తూ ప్రజలకు తీరని ద్రోహం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ యువ‌నేత ధ‌ర్మాన రామ్ మ‌నోహ‌ర్ నాయుడు మండిప‌డ్డారు. గురువారం శ్రీ‌కాకుళం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన ర‌చ్చ‌బండ‌- కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల క‌లిగే నష్టాల‌ను వివ‌రించారు.  ఈ సంద‌ర్భంగా రామ్ మ‌నోహ‌ర్ నాయుడు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనం కోసం జిల్లాల వారీగా వైద్య విద్యతో పాటు నాణ్యమైన చికిత్సలందించేందుకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను జగనన్న స్థాపించినట్లు వెల్లడించారు. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే దుస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు భారీగా పెరుగుతాయని, ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో లేకుండా పోతుందన్నారు. ఉచిత సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు దూరమవడంతో ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుందని వివరించారు.

రూ.లక్ష కోట్లు విలువచేసే ప్రజల ఆస్తుల ప్రైవేటు పరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి సహకరించే దుర్మార్గ పాలన రాష్ట్రంలో సాగుతోందని మండిపడ్డారు. ప్రజల నిధులతో నిర్మించిన సంస్థలను ప్రైవేట్‌కు అప్పగించడమంటే, రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహచించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు  చిట్టి జనార్ధన రావు, సర్పంచ్ గేదెల చంగలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ముకళ్ళ తాతబాబు, బొబ్బది చంద్రమౌళి, కంచు వసంతరావు, చిట్టి రవికుమార్, బాన్న నర్సింగరావు, గుండ హరీష్, మనోజ్ కుమార్, బోర చంటి, బాన్న శ్రీనివాసరావు,కూర్మారావు, ఎంపిటిసి గుండ భాస్కరరావు, మండల యూత్ ప్రెసిడెంట్  యళ్ళ శ్రీను, ఎస్సీ సెల్ అధ్యక్షుడు యజ్జల గురుమూర్తి  చింతపిల్లి హరి, పెద్దిన హరి, బట్న కృష్ణ, బట్న రమణ, గేదెల వెంకటరమణ, ముద్దాడ శ్రీను, ముచ్చ జగదీష్, పలాస రమేష్, పల్లా నర్సునాయుడు   మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top