చంద్రబాబు సర్కార్ మోసాలపై ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అనంత‌పురంలో పెద్ద ఎత్తున కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌

అనంతపురం:  చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం మోసాల‌పై ప్ర‌జా ఉద్య‌మం ఉధృతం చేస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హెచ్చ‌రించారు. ప్రజలకు భరోసా కల్పించటంలో టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయ‌న మండిపడ్డారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించగల ఏకైక నాయకుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డేనని ఆయన అన్నారు. గురువారం  అనంత‌పురంలో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో సిద్ధార్థ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కూట‌మి ప్ర‌భుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింద‌ని,  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి, ప్రైవేటు వ్యాపార వర్గాలకే మేలు చేకూర్చే విధానాలను అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు.  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ కల అనే కలను వైయ‌స్ జగన్ సాకారం చేశార‌ని అన్నారు. మెడికల్ కాలేజీలను పెత్తందార్లకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ప్రైవేటీకరణకు పాల్పడుతోంద‌ని బైరెడ్డి విమర్శించారు.  వైద్య‌ విద్యను ప్రైవేటు పరం చేసి, పేద విద్యార్థుల‌కు దూరం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌కు రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని చెప్పారు. 

Back to Top