తాడేపల్లి: రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఎదగాలని శ్రీ వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ఇది సోషల్ మీడియా యుగం అన్న ఆయన, ఇందులో యువత చాలా చురుకు అని ప్రశంసించారు. ఈ యుగంలో డ్రైవ్ చేసేది కూడా యువతే అని, వారి చేతుల్లోనే భవిష్యత్ ఉందని చెప్పారు. యువత ఏం నిర్ణయిస్తే ఆ ప్రభుత్వం వస్తుందని, అది యువతకు ఉన్న బలం అని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్ధి విభాగం సమావేశం జరిగింది. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు. పార్టీ విద్యార్థి విభాగం సమావేశంలో వైయస్ జగన్ ఏమన్నారంటే..: తులసి మొక్కల్లా ఎదగాలి: సమాజంలో విద్యార్థులు, యువకుల ప్రాధాన్యత, రాజకీయాల్లో భవిష్యత్ గురించి ఆలోచిస్తే.. ఎవరైనా ఒక నాయకుడి గొప్పతనానికి యువత, విద్యార్థి దశ నుంచే బీజం పడుతుంది. మీరంతా జనరేషన్–జీ లో ఉన్నారు. మీరు ఒకటి, రెండు టర్మ్స్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారు. మీరు రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. అసలు రాజకీయాల్లో ఎలా ఉండాలంటే, ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పేలా ఉండాలి. మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడే ఆ గౌరవం దక్కుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరం చూస్తున్నాం. మీకు తెలియనిది కాదు. చాలా మంది సీనియర్ నాయకుల కన్నా కూడా మీకు యాక్టివ్. సోషల్ మీడియాలో యాక్టివిటీ మీ దగ్గరి నుంచి ప్రారంభం అవుతుంది. మంచి విత్తనం నాటినప్పుడే..: విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు వేస్తే.. చివరకు దేశాల్లో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే, ఇప్పుడు దేశాల్లో సైతం ప్రభావం చూపుతున్నారు. బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అది జరిగింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. రాజకీయ పరిస్థితి మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేది మనమంతా కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలని మనమంతా అనుకుంటున్నాం కాబట్టి. ఇక్కడి రాజకీయ పరిణామాలను గమనించాల్సి ఉంది. ఒక యువకుడు రేపు ఎదిగి, భావి ప్రపంచంతో పోటీ పడి, తన ఒక ఉద్యోగాన్ని అవలీలగా సంపాదించుకునే పరిస్థితి ఉందా? ఆలోచించండి. ఏదైనా రాత్రికి రాత్రి జరిగేది కాదు. ఒక నాయకుడు ఒక అడుగు వేస్తే.. అలాగే ఈరోజు వేసే విత్తనం చెట్టు కావడానికి, నాయకుడు చేసే పని విజన్ ట్రాన్స్‌లేట్ కావడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అదే ఈరోజు సరైన విత్తనం వేయకపోతే, ఎన్నేళ్లు గడిచినా పరిస్థితి మారదు. 10, 15 ఏళ్ల తర్వాత కూడా మన బతుకులు మారవు. ఇలాగే ఉంటాం. మనం లీడర్లు కాబోతున్నప్పుడు, అలాంటి మంచి విత్తనాలు వేసే ఆలోచన మనకు ఉండాలి. అదే మన మనసులో ఉండాలి. మనం చేసే పని వల్ల భవిష్యత్ తరాలు మారాలి. మారుతాయా లేదా అని కూడా మనం ఆలోచించాలి. నాడు విద్యా రంగంలో సంస్కరణలు: గత మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? ఈ 18 నెలల నుంచి ఎలా ఉంది? అనేది ఒక్కసారి పోల్చి చూస్తే.. మనం యువకులం. మనం మార్చకపోతే వ్యవస్థ మారదు. మనం మార్చడానికి వేసే అడుగులు మంచి ఫలితాలు ఇస్తాయి. అందుకే విద్యార్థుల భవిష్యత్‌ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దేలా విద్యా రంగంలో మనం చాలా మార్పులు చేశాం. ఆ దిశలో అడుగులు వేశాం. కేజీ నుంచి పీజీ వరకు పిల్లవాడు ఎలా నిలబడగలుగుతాడు? పోటీని ఎలా ఎదుర్కోగలుగుతాడు? అనేది తొలిసారి మన పార్టీ వైయస్ఆర్‌సీపీ మాత్రమే. నిజానికి విద్యార్థులకు ఓటుహక్కు ఉండదు కాబట్టి, ఏ పార్టీ కూడా వారి గురించి ఆలోచించదు. కానీ, వారి గురించి ఆలోచించిన వారు రాజకీయ నాయకుడు కాదు. ఒక నేతగా మారుతాడు. ఇది నిజం గత మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. కార్పొరేట్ స్కూళ్లకు థీటుగా వాటిని అభివృద్ధి చేశాం. ఇంకా చెప్పాలంటే ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడేలా మార్చాం. తొలిసారిగా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమ్ తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ పీరియడ్, ఆ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మొదలుపెట్టాం. ప్రతి పిల్లవాడికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇచ్చాం. 8వ తరగతి పిల్లాడికి ట్యాబ్‌లు ఇచ్చాం. ఇంకా ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చాం. మన పిల్లలకు దాన్ని ప్రభుత్వ స్కూళ్లలో పరిచయం చేశాం. జెనీవా నుంచి టీమ్ వచ్చి ఇక్కడ పని చేయడం మొదలుపెట్టారు. అది ఇప్పటికీ అమలులో ఉంటే, 2024–25 విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్‌లో మొదలై, 2025–26లో సెకండ్ క్లాస్.. అలా 2035 నాటికి మన పిల్లలు టెన్త్ క్లాస్‌ను ఐబీలో రాసే విధంగా వారు వచ్చి పని చేయడం మొదలు పెట్టారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా..: ఆ స్థాయిలో పిల్లలకు మనం విద్యను అందించగలిగితే, మన పిల్లలు ప్రపంచంతోనే పోటీ పడగలుగుతారు. అలా పోటీ పడేలా చదువులు సాగుతున్నాయా? అనేది ముఖ్యం. ఆ దిశలోనే చిత్తశుద్ధితో పని చేశాం. విద్యా రంగంల సమూల మార్పులకు నాడు–నేడుతో శ్రీకారం చుట్టాం. అమ్మ ఒడితో పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించాం. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం గోరుముద్ద మొదలు అనేక మార్పులు. అలా ఉన్నత విద్యా రంగంలోనూ మార్పులు చేశాం. జాబ్ ఓరియెంటెడ్ కరికులమ్ తీసుకొచ్చాం. మన చదువుల్లో లేనిది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది అన్నది ఎస్సెస్‌మెంట్ చేశాం. ఆ దిశలోనే మార్పు చేస్తూ.. ఎడెక్స్‌ను తీసుకొచ్చాం. అలా ఒక సంస్థను ఇక్కడికి తీసుకొచ్చాం. వారి కోర్సులు, వారి డిగ్రీలు తీసుకొచ్చాం. ఆ మేరకు వాటిని మన కరికులమ్‌లో చేర్చాం. ఆన్‌లైన్‌లో వారిని పార్ట్ చేశాం. డిగ్రీ కోర్సుల్లో నాణ్యత పెంచాం. తొలిసారి డిగ్రీలో అప్రెంటిస్ విధానం తీసుకొచ్చాం. అలా కరికులమ్‌లో చాలా మార్పు చేశాం. ఎడెక్స్ వారే డిగ్రీ కూడా ఇచ్చే విధంగా చేశాం. గణనీయంతా ‘నాక్’ రిజిస్ట్రేషన్: ఆ రెండింటికీ రూ.16,800 కోట్లు: కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ఇంప్రూవ్ చేస్తూ, వాటికి ‘నాక్’ (నేషనల్ ఎస్సెస్‌మెంట్ అండ్ ఎక్రెడిటేషన్ కౌన్సిల్) రిజిస్ట్రేషన్ చేయించాం. అందుకే 2019 నాటికి కేవలం 257 కాలేజీలకు నాక్ రిజిస్ట్రేషన్ ఉంటే, 2024 ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 437. ఇంకా పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులు ఇబ్బంది పడొద్దు. వారు పిల్లల చదువుల కోసం అప్పులపాలు కావొద్దు అని చాలా చేశాం. ఆ దిశలోనే గతంలో లేనిది, తొలిసారి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం విద్యాదీవెన తీసుకొచ్చాం. ఆ పథకం కింద రూ.12,609 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి త్రైమాసికం అయిపోగానే, దానికి సంబంధించిన ఫీజులు పిల్లల తల్లుల ఖాతాల్లో వేశాం. ఇంకా వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చు కింద ఇచ్చాం. డిగ్రీ పిల్లలకు ఏటా రూ.20 వేలు, రెండు విడతల్లో ఇచ్చే వాళ్లం. వసతి దీవెన కింద మొత్తం రూ.4275 కోట్లు ఇచ్చాం. అలా ఉన్నత విద్యా రంగంలో ఒక్క విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.16,800 కోట్లు ఖర్చు చేశాం. అది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ ఘనత. దీని వల్ల పేద విద్యార్థులు చదువు మానేసే పరిస్థితి రాలేదు. నేడు అంతా తిరోగమనం: కానీ, ఈరోజు ఏం జరుగుతోంది. గత 18 నెలలుగా అంతా తిరోగమనం. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియమ్ లేదు. టోఫెల్ క్లాస్‌లు లేవు. ట్యాబ్‌లు ఆపేశారు. గోరుముద్ద కింద కూడా నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఇంక ఉన్నత విద్యా రంగం చూస్తే, పిల్లలు బాగా చదువుకోవద్దన్న కుట్ర కనిపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సంబంధించిన పీజు రీయింబర్స్‌మెంట్ ఏప్రిల్‌లో ఇవ్వాల్సి ఉంటే, దాన్ని చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపించాడు. దాంతో అక్కడి నుంచి బ్రేక్ పడింది. అలా ఇప్పటికి ఏడు త్రైమాసికాలు. డిసెంబరుతో మరో త్రైమాసికం జోడవుతుంది. ఒక్కో త్రైమాసికానికి రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు. అలా ఏకంగా దాదాపు రూ.4900 కోట్లు పెండింగ్‌లో ఉంటే, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. అంటే రూ.4200 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఈ డిసెంబరు వస్తే మరో రూ.700 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. వసతి దీవెన కింద డిగ్రీ పిల్లాడికి ఏటా రూ.20 వేలు. రెండు విడతల్లో ఇచ్చాం. ఈ పథకం కోసం ఏటా రూ.1100 కోట్లు ఇవ్వాలి. కానీ రెండేళ్ల నుంచి పథకాన్ని ఎగ్గొట్టడంతో రెండేళ్లలో రూ.2,200 కోట్లు పెండింగ్. అంటూ రెండింటికి కలిపి దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పడ్డారు.దీంతో పిల్లలు చదువు మానేస్తున్నారు. జీఈఆర్ కూడా డౌన్: ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైయస్ఆర్‌సీపీ నాయకత్వం తీసుకోకపోతే, పిల్లలు చదువులు మానేస్తారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. మీ అందరికీ తెలుసు. జీఈఆర్ (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యలో ఎందరు చేరుతున్నారని చూస్తే.. మన ప్రభుత్వం రాక ముందు 2018–19లో జీఈఆర్ 27.86 శాతం ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక 2023–24 నాటికి జీఈఆర్ 37 శాతానికి పెరిగింది. అది ఇప్పుడు మళ్లీ రివర్స్ అయింది. చదువులు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్ చూస్తే ఆందోళనకరం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం. ఉద్యోగాలు ఘనం: మన ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రభుత్వ రంగంలోనే దాదాపు 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు 2,13,662 ఇచ్చాం. గ్రామ వార్డు సచివాలయాల్లో మనకు చాలా మంది కనిపిస్తారు. వాటిలో దాదాపు 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఆర్టీసీ నుంచి 52 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఆస్పత్రుల్లో జీరో వెకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత లేకుండా చేశాం. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో 61 శాతం వైద్య నిపుణుల కొరత ఉంటే, అది మన దగ్గర కేవలం 4 శాతం మాత్రమే. విద్యా రంగంలో 10,300 పోస్టులు భర్తీ చేశాం. అంటే టీచర్ పోస్టులు ఇచ్చాం. డీఎస్సీ సమస్యలన్నీ పరిష్కరించి, ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి కాకుండా 2.66 లక్షల మంది వాలంటీర్లు. ఆప్కాస్‌లో మరో లక్ష మంది. 18 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్‌లో. ఇంకా రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసిన ఎండీయూ వాహనాల్లో 20 వేల ఉద్యోగాలు. అలా ప్రభుత్వ రంగంలోనే దాదాపు 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఎంఎస్‌ఎంఈలు 4.78 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయడం ద్వారా దాదాపు 33 లక్షల ఉద్యోగాల కల్పన. మన హయాంలో వాటికి క్రమం తప్పకుండా రాయితీలు ఇచ్చాం. వాటిని నిలబెట్టాం. వాస్తవానికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈలది కీలక పాత్ర. వాటిలో పెట్టుబడి తక్కువ. ఉద్యోగాలు ఎక్కువ. మరోవైపు పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడి ఎక్కువ. ఉద్యోగాలు తక్కువ. ఇంకా లార్జ్ అండ్ మెగా రంగంలో మరో లక్ష ఉద్యోగాల కల్పన. అన్నీ కలిపితే.. 40,13,552 ఉద్యోగాలు కల్పించాం. ఇది మనం చెప్పే లెక్కలు కాదు. సామాజిక సర్వేలో చూపిన వివరాలు. స్వయం ఉపాధికి ప్రోత్సాహం: నిజంగా మెరుగైన ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్‌లో వస్తాయి. అది ఒక విప్లవం. ఆ దిశలో ఆసరా, సున్నా వడ్డీకే రుణాలు, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అమలు చేశాం. అక్కచెల్లెమ్మలు కాళ్ల మీద నిలబడేలా పలు కంపెనీలు ఐటీసీ, పీ అండ్ జీ, రిలయెన్స్, అమూల్ వంటి సంస్థలతో టైఅప్ చేశాం. చేయూత ద్వారా దాదాపు 26 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, ఆసరా, సున్నా వడ్డీ ద్వారా దాదాపు కోటి మందికి మేలు జరిగింది. నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. వ్యవసాయం దండగ కాదు. పండగ: పోర్టులు. ఎయిర్‌పోర్టులు: రాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయం దండగ కాదు. పండగ అని చేసి చూపాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు చేయి పట్టుకుని నడిపాం. రైతులకు ఏ ఆపద వచ్చినా, వెంటనే ఆదుకున్నాం. ఇంకా 4 పోర్టుల నిర్మాణం చేపట్టాం. అంతకు ముందు కేవలం 6 పోర్టులు మాత్రమే ఉంటే, మన హయాంలో 5 ఏళ్లలో మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. వాటిలో మూడు ప్రభుత్వ రంగంలోనివే. అవి మూలపేట, రామయ్యపట్నం, మచిలీపట్నం పోర్టులు. వాటి పనులు చాలా వేగంగా జరిగాయి. సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఒక్క కాకినాడ పోర్టులో మాత్రం ప్రైవేటు రంగంలో అభివృద్ధి జరుగుతోంది. ఇంకా 10 షిప్పింగ్ హార్బర్లు. ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల పనులు చురుగ్గా కొనసాగాయి. నాడే అదానీ డేటా సెంటర్: మన హయాంలోనే అదానీ డేటా సెంటర్ ప్రాసెస్ జరిగింది. సింగపూర్ నుంచి సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. అవన్నీ మనం చేశాం కాబట్టే, ఇప్పుడు డేటా సెంటర్. అసలు డేటా రావాలంటే కేబుల్ కావాలి కదా? భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకణ చేసి, వేగంగా అన్ని అనుమతులు పొంది, పనులు కూడా చేశాం. అందు కోసం దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. అవన్నీ మనం చేశాం కాబట్టి, పురోగతి కనిపిస్తోంది. అలా మంచి విత్తనాలు నాటాం. చంద్రబాబు దారుణం మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్: ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న చెడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. 1923 నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. వాటిలో ఒక్కటి కూడా చంద్రబాబు కట్టలేదు. అదే మన ప్రభుత్వ హయాంలో, ఏకంగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. ఏడు కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్ కాలేజీ వల్ల స్థానికంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టీచింగ్ ఆస్పత్రి మాదిరిగా పని చేస్తుంది. ఆ స్థాయిలో వైద్య సేవలందుతాయి. పేదలకు ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే అవన్నీ అందుబాటులోకి వస్తే, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి ఆగిపోతుంది. ఇంకా ఆ 17 మెడికల్ కాలేజీలతో 2550 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వాటిలో సగం సీట్లు ఫ్రీగా పిల్లలకు దక్కుతాయి. మిగిలిన సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీల కంటే తక్కువ ఫీజుతో వస్తాయి. మనం చేపట్టిన మెడికల్ కాలేజీల్లో మన హయాంలోనే 7 కాలేజీలు పూర్తయ్యాయి. 5 కాలేజీల్లో 3 బ్యాచ్‌లు వచ్చాయి. పాడేరు మెడికల్ కాలేజీలో గత ఏడాది క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తామంటే వద్దని చంద్రబాబు లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం రూ.3000 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన 10 కాలేజీలకు మరో రూ.5 వేల కోట్లు కావాలి. 5 ఏళ్లలో ఖర్చు చేస్తే చాలు. అంటే ఏటా రూ.1000 కోట్లు మాత్రమే. అది కూడా ఖర్చు చేయకుండా, ఏకంగా వాటిని అమ్మేస్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లు. మెడికల్ కాలేజీలకు కావాల్సింది ఏటా కేవలం రూ.1000 కోట్లు. అవి కూడా ఖర్చు పెట్టకుండా, ఆ కాలేజీలు అమ్మేస్తూ స్కామ్‌లు చేస్తున్నాడు. ఇది మీ యుగం: దీన్ని ప్రశ్నించేది యువతనే. దీనిపై రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ. మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు పార్టీ కార్యాచరణ చేపట్టింది. పార్టీ పరంగా అన్ని కమిటీల నిర్మాణం జరుగుతోంది. గ్రామస్థాయిలో కూడా కమిటీల ఏర్పాటు అవుతున్నాయి. గ్రామస్థాయిలో కూడా విద్యార్థి, యువజన అనుబంధ విభాగం కూడా రావాలి. చైతన్యం అక్కణ్నుంచే మొదలు కావాలి. ఇది సోషల్ మీడియా యుగం. ఈ యుగంలో డ్రైవ్ చేసేది మీరు. మీ చేతుల్లో భవిష్యత్ ఉంది. మీరు ఎలా డిసైడ్ చేస్తే, ఆ గవర్నమెంట్ వస్తుంది. ఆ ప్రభుత్వం మీరు సిట్ అంటే సిట్. స్టాండ్ అంటే స్టాండ్. దటీజ్ ది పవర్ ఆఫ్ యంగ్‌స్టర్స్. కచ్చితంగా దీన్ని గుర్తు పెట్టుకోవాలి. అన్నింటా మీ ఇన్‌వాల్వ్‌మెంట్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతోంది. మరోవైపు పార్టీపరంగా అన్ని అనుబంధ విభాగాల ఏర్పాటు చురుగ్గా సాగుతోంది. మీరు అన్నింటిలో ఇన్‌వాల్వ్ కావాలి. ప్రతి చోటా మీ పాత్ర చాలా కీలకం. మీరు అందరినీ కలుపుకుని నడవాలి. ఈనెల 12న నియోజకవర్గాల్లో ర్యాలీలు. కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. మీరంతా చురుగ్గా పాల్గొనాలి. ఆ కార్యక్రమం సీఎం చంద్రబాబుకు షాక్ కొట్టాలి. మెడికల్ కాలేజీలపై నిర్ణయాన్ని మార్చుకునేలా చేయాలి. ఇంకా డిసెంబరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆందోళన. అప్పటి వరకు చంద్రబాబుకు తగిన టైమ్ కూడా ఇచ్చినట్లు ఉంటుందని, ఆ అంశం మీద కూడా గేర్ మార్చి చంద్రబాబు మెడలు వంచే కార్యక్రమం చేద్దామని శ్రీ వైయస్ జగన్ పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎ.రవిచంద్ర, తోట రాంజీ, శ్రీవాత్సవ, చెవిరెడ్డి హర్షిత్, ప్రణయ్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ ఓబుల్‌రెడ్డి, నీలి ఆనంద్, నరేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.