టీడీపీ వేధింపులతో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య

జగ్గయ్యపేటలో ఉరి వేసుకున్న గుగ్గిళ్ల శ్రీను

బాధిత కుటుంబ స‌భ్యుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

 ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ నాయకుల బెదిరింపులను తాళలేక మనస్తాపానికి గురైన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేటలోని నాగమయ్య బజారుకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త గుగ్గిళ్ల శ్రీను (31) సమీపంలోని స్టీల్‌ ప్లాంట్‌లోని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం టీడీపీ నేత వీర్ల వెంకన్న ఇంటివద్ద విద్యుత్‌ స్తంభం అడ్డుగా ఉండటంతో దానిని తొలగించి.. శ్రీను ఇంటి ఎదుట అధికారులకు తెలియకుండా రాత్రికి రాత్రే కొత్త విద్యుత్‌ స్తంభాన్ని ఏర్పాటు చేశాడు.

తన ఇంటిముందు స్తంభం ఎందుకు పెట్టారని, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని, విద్యుత్‌ తీగలు కిటికీలకు తగిలితే ప్రమాదం జరుగుతుందని శ్రీను ప్రశ్నించాడు. దీంతో శ్రీను, అతడి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో శ్రీను ఆ సమస్యను విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అధికారుల నుంచి సమాధానం రాకపోగా.. వెంకన్నతో పాటు టీడీపీ నాయకులు షేక్‌ చాంద్‌సాహెబ్, మద్దం నరసింహారావు, నాగబాబు, సరస్వతి, రహంతుల్లా శ్రీను ఇంటికి వచ్చి మరోసారి బెదిరించి వెళ్లారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఈ నెల 11న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడు పనిచేసే ప్లాంట్‌ వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నాడు. ఎస్‌ఐ వెంక­టేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్‌ (చిన్నా) తదితరులు శ్రీను మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

టీడీపీ కౌన్సిలర్లు కావేటి కృష్ణ, గొట్టె నాగరాజు ప్రోద్బలంతోనే వీర్ల వెంకన్న, షేక్‌ చాంద్, మద్దం నరసింహారావు, నాగబాబు, షేక్‌ బబేబీ, బషీర్, రహీంతుల్లా, వీర్ల సరస్వతి కలిసి తన భర్తను మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని శ్రీను భార్య గోవిందమ్మ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని, నాకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  గుగ్గిళ్ల శ్రీను కుటుంబ సభ్యులను ఆదివారం వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పరామర్శించారు.

Back to Top