పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే అక్ర‌మ అరెస్టులు 

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి

విశాఖపట్నం: సీఎం చంద్రబాబుకి పాల‌న చేత‌కాక, హామీలు అమ‌ల్లో త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత పాల‌న సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా  గ‌త ప్ర‌భుత్వంలో ప‌నిచేసిన ఐఏఎస్ అధికారులు ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డిల‌ అక్ర‌మ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హామీల అమ‌లు విష‌యంలో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వంపై వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు,  ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకే ఇలాంటి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా అవినీతికి ఆస్కారం లేక‌పోయినా మ‌ద్యం స్కామ్ జ‌రిగిన‌ట్టు త‌ప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో బెల్ట్ షాపులు పూర్తిగా ర‌ద్దు చేసి, మ‌ద్యం షాపులు త‌గ్గించి, అమ్మ‌కాలు త‌గ్గిస్తే స్కాం జ‌రిగింద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉందన్నారు. 

ఆ డిస్టిల‌రీల‌న్నీ చంద్ర‌బాబు తెచ్చిన‌వే..
రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిల‌రీల‌కు చంద్రబాబే అనుమ‌తులిచ్చాడని, గ‌త వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో ఒక్క డిస్టిల‌రీకి కూడా అనుమ‌తివ్వ‌లేదని వ‌రుదు క‌ళ్యాణి స్పష్టం చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తే, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మ‌ద్యం ఏరులై పారుతోంది. వీధివీధినా బెల్ట్ షాపులు తెరిచి 24 గంట‌లూ ఇష్టారాజ్యంగా మ‌ద్యం అమ్మ‌కాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్ర‌బాబుకి ద‌మ్ముంటే త‌న మీద న‌మోదైన ఇన్న‌ర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్క‌ర్ కుంభ‌కోణం, ఏపీ ఫైబ‌ర్‌నెట్ స్కాం, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కుంభ‌కోణాల‌పై విచార‌ణకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగ‌మ‌నంలో ప‌య‌నిస్తోందని, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌నే కాకుండా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వ వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదని, అరాచ‌క పాల‌న‌తో ఎంతోకాలం ప్ర‌జాచైత‌న్యాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైయ‌స్సార్సీపీ నేతృత్వంలో ప్ర‌జా ఉద్య‌మాలతో కూట‌మి ప్ర‌భుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Back to Top