9న బంగారుపాళ్యెం మామిడి మార్కెట్‌కు వైయస్ జగన్

మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడి

తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు రేటు లేక మామిడి రైతుల గోడు 

మద్దతుధరకు మామిడి కొనుగోళ్ళు చేయించడంలో ప్రభుత్వం విఫలం

సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే రైతుల అగచాట్లు

మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వైయస్ జగన్ పర్యటన

మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: గిట్టుబాటు రేటు లేక అల్లాడుతున్న మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 9న బంగారుపాళ్యెం మామిడి మార్కెట్‌ను ప్రతిపక్షనేత వైయస్ జగన్ సందర్శిస్తారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిలు తెలిపారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్‌లలో సాగు చేసిన మామిడి పంటను కొనేవారు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే పారబోస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు  ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే మామిడి రైతులు నష్టాలతో కుదేలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకుని, ప్రభుత్వ మెడలు వంచి గిట్టుబాటు రేటు కల్పించేందుకు ప్రతిపక్షనేత వైయస్ జగన్ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారని వెల్లడించారు. ఇంకా వారేమన్నారంటే..

98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు టీడీపీకి చెందిన వారివే : మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, పొగాకు, మిర్చి, పత్తి, మామిడి, చెరకు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లా మామిడిపంటకు ప్రసిద్దిగాంచింది. ఈ ప్రాంతంలో అనేక పల్ప్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలు, దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాలోని ప్రధాన మామిడి మార్కెట్‌ల వద్ద ఎక్కడ చూసినా మామిడి పంటతో కూడిన లారీలు, ట్రాక్టర్‌లే బారులు తీరి కనిపిస్తున్నాయి. రైతుల నుంచి పల్ప్ కొనుగోలు చేయాల్సిన ఫ్యాక్టరీలు గత ఏడాది ఉత్పత్తి చేసిన పల్ప్‌ నిల్వలే అధికంగా ఉండటం వల్ల ఈ ఏడాది మళ్ళీ పల్ప్ ఉత్పత్తి చేస్తే తమకు నష్టం వస్తుందని చెబుతున్నాయి. దీనిలో అధికశాతం పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోళ్ళు నిలిపివేశాయి. ఫలితంగా మార్కెట్‌లో మామిడి కొనేవారు లేక, రైతులు తెచ్చిన పంటను రోడ్ల మీద పారవేసి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ రైతులు ఇంత దారుణంగా నష్టపోలేదు. గతంలో మామిడికి రేటు పడిపోయినప్పుడు కోల్డ్‌ స్టోరేజీలను నిర్మించి, పల్ఫ్‌ను స్టోరేజీ చేసేందుకు సదుపాయాలు కల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. పైగా పల్ప్ ఫ్యాక్టరీల‌ సిండికేట్‌ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఉందని పథకం ప్రకారం ఒక తప్పుడు ప్రచారాన్ని ఎల్లో మీడియా ద్వారా ప్రారంభించారు. ఈ జిల్లాలో 98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు తెలుగుదేశంకు చెందిన వారివే. వారికి చెందిన పల్ప్ ఫ్యాక్టరీలతో కొనుగోళ్లు చేయించలేక, ప్రతిదానికీ వైయస్ఆర్‌సీపీపై నెపాన్ని నెట్టేయడం, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. సమస్యను పరిష్కరించలేక, దానిపై ఎదురుదాడి చేయడం చంద్రబాబుకు అలవాటు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు, వారి పక్షనా పోరాడేందుకు ప్రతిపక్ష నేత వైయస జగన్ ఈ ప్రాంతంలో మామిడి మార్కెట్‌ను సందర్శించి, రైతులతో మాట్లాడనున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 

మామిడికి గిట్టుబాటు రేటు కల్పించలేని దద్దమ్మ ప్రభుత్వమిది : వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి 

కూటమి ఏడాది పాలన సందర్భంగా అబద్దాలతో పండుగలు చేసుకుంటున్న సీఎం చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కన్నీరు, వారి కష్టాలు కనిపించడం లేదు. మార్కెట్‌లో కేజీ రూ.2 లకు కూడా ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ తరుణంలో మద్దతుధరను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? గతంలో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిబడింది వైయస్ఆర్, వైయస్ జగన్. చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్‌లలో మామిడి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం తోటల్లోని మామిడిని కోయడం కూడా నష్టదాయకమేనంటూ రైతులు చెట్లమీదనే వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. కానీ చంద్రబాబు మాత్రం తనకు నిత్యం భజన చేసే ఈనాడు పత్రిక, టీవీ5 మీడియాల ద్వారా మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణమంటూ దిగజారుడు ప్రచారం చేయిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది ఎవరో కూడా వారికి తెలియదా? పల్ప్ ఫ్యాక్టరీలు గత ఏడాది నిల్వలను చూపి, కొత్తగా మామిడి కొనుగోళ్ళు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలో కూడా తెలియకుండా పాలన చేస్తున్నారా? తూతూ మంత్రంగా జిల్లా కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయించి, ప్రభుత్వం మద్దతుధర ఇస్తుంది, ఫ్యాక్టరీలు కేజీ రూ.4 కి కొనుగోలు చేయాలని చెప్పి వెళ్ళిపోయారు. అంతేకానీ ఫ్యాక్టరీలను ఒత్తిడి చేసి, పంటను కొనుగోలు చేయించడం లేదు. ఈ దారుణమైన పరిస్థితుల్లో రైతులు స్వచ్ఛందంగా రైతులు మామిడి తోటలను నరికేస్తున్నారు. గిట్టుబాటుధర కల్పించలేని దద్దమ ప్రభుత్వం చంద్రబాబుది. స్వయంగా మామిడి రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బంగారుపాళ్యెం మార్కెట్‌కు రానున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
 

Back to Top