వైయస్‌ఆర్‌సీపీని అరాచ‌క శ‌క్తిగా చూపించే కుట్ర‌

పోలీసులను ప్రేరేపించి కూట‌మి నాయ‌కుల వికృత చేష్ట‌లు

రాజ‌కీయంగా ఎదుర్కోలేక పార్టీపై బుర‌ద‌జ‌ల్లే సిగ్గుమాలిన చ‌ర్య‌

పోలీస్ వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న వైనంపై  వైయస్‌ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం 

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయస్‌ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్ రెడ్డి   

వైయస్‌ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌లు ఏం చేసినా కేసు.. నోరెత్తితే జైలు 

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తే త‌ట్టుకోలేక‌ పోతున్నారు

వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుకలు వైభవంగా జ‌రిగాయ‌నే అక్క‌సు

త‌ట్టుకోలేక పొట్టేళ్ల మాంసంతో విందు చేసుకున్న వారిపైనా కేసులే

ఆఖ‌రుకి సోష‌ల్ మీడియా యాక్టివిస్టులపై రాజ‌ద్రోహం కేసులు

న్యాయ‌స్థానాలు మొట్టికాయ‌లు వేస్తున్నా మారని పోలీసుల తీరు 

ప‌త్తికొండ‌, క‌దిరి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన మ‌నోహ‌ర్ రెడ్డి

తాడేప‌ల్లి:  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌శ్నిస్తుంటే స‌మాధానం చెప్పుకోలేక‌.., కూట‌మి నాయ‌కుల అవినీతి, దౌర్జ‌న్యాలు, దోపిడీలు, అత్యాచారాల‌పై చ‌ర్య‌లు తీసుకోలేక.. అస‌త్య ప్ర‌చారం, క‌ట్టు క‌థ‌ల‌తో వైయ‌స్సార్ పార్టీని అరాచ‌క శ‌క్తిగా చిత్రీక‌రించి ప్ర‌జ‌ల్లో ప‌ల‌చ‌న చేయ‌డానికి కూటమి ప్ర‌భుత్వం తొక్క‌ని అడ్డ‌దారులు లేవ‌ని వైయస్‌ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ హింస‌ను  ప్రేరేపిస్తుంద‌ని ప్ర‌జ‌ల్లోకి సందేశం పంపించ‌డానికి రోజురోజుకీ దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారని చెప్పారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌శ్నించే గొంతులు నొక్కాల‌ని, వైయస్‌ఆర్‌సీపీని లేకుండా చేయాల‌ని, వైయస్‌ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసి వారి మ‌నోధైర్యాన్ని దెబ్బ‌తీయ‌డమే ల‌క్ష్యంగా పోలీసుల‌ను ప్ర‌యోగించి అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని వివ‌రించారు. ఆఖ‌రుకి పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారి జ‌న్మ‌దిన వేడుక‌లు దేశ వ్యాప్తంగా వైభ‌వంగా జ‌ర‌గ‌డంతో ఓర్వ‌లేని కూట‌మి నాయ‌కులు పొట్టేళ్ల మాంసంతో విందులు చేసుకున్న వారిపైనా కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌శ్నిస్తున్నార‌న్న కార‌ణంతో సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై ఇన్నాళ్లూ బీఎన్ఎస్ 111 సెక్ష‌న్ కింద కేసులు, గంజాయి కేసులు పెట్టిన పోలీసులు.. కోర్టులు మొట్టికాయ‌లు వేస్తుండ‌టంతో కొత్త‌గా రాజ‌ద్రోహం కేసులు పెడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పొలిటిక‌ల్ బాస్‌ల అండ చూసుకుని చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే భ‌క్ష‌కులుగా మారిపోయార‌ని అన్నారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ లు తమ పీకుడు భాష ద్వారా వైయస్‌ఆర్‌సీపీ వారి మీద అక్ర‌మ కేసులు పెట్టాల‌ని సందేశం పంపుతున్నార‌ని ఆరోపించారు. క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం ముత్యాల‌వారిప‌ల్లె సంఘ‌ట‌న‌, ప‌త్తికొండ కోర్టు హాల్ ఘ‌ట‌న‌లు పోలిటిక‌ల్ బాస్‌ల ఆదేశాల‌తోనే జ‌రిగాయ‌ని, చ‌ట్టాల‌ను ఉల్లంఘించిన ఆ పోలీసుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌నోహ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 
 

● విందు చేసుకుంటే కేసులా?

ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారి జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఘ‌నంగా నిర్వ‌హిస్తే దాన్ని కూడా కూట‌మి ప్ర‌భుత్వం చూసి ఓర్వ‌లేక‌పోయింది. వైయస్‌ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌లు నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు పెట్టారు. అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం బొమ్మ‌కానిప‌ల్లెలో పొట్టేలు కోసుకుని విందు చేసుకున్నార‌నే కార‌ణం చూపించి యానిమ‌ల్ క్రూయ‌ల్టీ యాక్ట్ కింద ఆరుగురిపై కేసు పెట్టారు. స‌త్య‌సాయి జిల్లా క‌న‌గానిప‌ల్లె మండ‌లం బాగ‌కోట గ్రామంలో కూడా ఇదే విధంగా విందు చేసుకున్నార‌ని జీవ‌హింస చేశార‌ని కేసు పెట్ట‌డ‌మే కాకుండా కోర్టుకు రిమాండ్‌కి తీసుకొచ్చేట‌ప్పుడు అక్ర‌మ ఆయుధాలు క‌లిగి ఉన్నార‌ని ఇండియ‌న్ ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా అక్ర‌మ కేసు పెట్టారు. వైయ‌స్ జ‌గ‌న్ గారి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని సీహెచ్‌సీలో ప్ర‌భుత్వ అనుమ‌తితో ర‌క్త‌దాన శిబిరం నిర్వహించి ఎంతోమంది ర‌క్త‌దానం చేస్తే దానికి కూడా ఓర్వ‌లేక సీహెచ్‌సీ సెక్యూరిటీ గార్డుతో ఫిర్యాదు చేయించి ఎంతోమందిపై కేసు న‌మోదు చేశారు. ప‌ర్మిష‌న్ తీసుకుని నిబంధ‌న‌ల ప్ర‌కారం డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించినా ఈ ప్ర‌భుత్వం ఓర్వ‌లేక‌పోయింది. కంచిక‌చ‌ర్ల మండ‌లం కీస‌ర గ్రామంలో టీడీపీ ఫ్లెక్సీల‌ను చింప‌క‌పోయినా వైయస్‌ఆర్‌సీపీకార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రంతా స్టేష‌న్ సెల్‌లో అక్ర‌మంగా నిర్బంధించారు. ద్వార‌కా తిరుమ‌ల‌లో ఒక ఫ్లెక్సీలో ర‌ప్పా ర‌ప్పా అని రాసి ఉంద‌నే కార‌ణంతో ఏడుగురిపై కేసు పెట్టారు. చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వర్గం కుప్పం మండ‌లంలో 16 మందిపై కేసు పెట్టారు. ఇత‌ర మండ‌లాల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను అక్ర‌మంగా బైండోవ‌ర్ చేసి స్టేష‌న్‌ల‌లో నిర్బంధించారు. 

● పార్టీకి సంబంధం లేని వ్య‌క్తిని తీసుకొచ్చి.. 

స‌త్య‌సాయి జిల్లా త‌న‌క‌ల్లు మండలం ముత్యాల‌చెరువు గ్రామంలో ద‌ళిత వ‌ర్గానికి చెందిన అజ‌య్ దేవ్ అనే యువ‌కుడికి త‌న వ‌దిన‌తో జ‌రిగిన గొడ‌వ‌ను వైయస్‌ఆర్‌సీపీకి ఆపాదించే ప్ర‌య‌త్నం చేశారు. మంత్రి నారా లోకేష్ స‌హా ఎల్లో మీడియా మొత్తం జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త అయిన అజ‌య్ దేవ్‌ను వైయస్‌ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌గా చిత్రీక‌రించి రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని చూశారు. వైయ‌స్ జ‌గ‌న్ గారి జ‌న్మ‌దిన వేడుక‌లు అద్భుతంగా జ‌రిగాయ‌నే ఆలోచ‌న‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌థ‌కం రూపొందించారు. ఆ యువ‌కుడిపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించి న‌డ‌వ‌లేని స్థితిలో ఉండగా చెప్పులు లేకుండా పోలీసులు రోడ్ల‌పై తిప్పారు. టీడీపీ సోష‌ల్ మీడియా ద్వారా నారా లోకేష్ ఆ వీడియోల‌ను వైర‌ల్ చేయించాడు. వైయ‌స్ జ‌గ‌న్ బ‌ర్త్ డే వేడుక‌ల్లో వైయస్‌ఆర్‌సీపీ కార్యక‌ర్త గ‌ర్భిణిపై దౌర్జ‌న్యం చేశాడ‌ని అస‌త్య ప్ర‌చారం చేసి పార్టీపై బుర‌ద‌జ‌ల్లాల‌ని చూశారు. చివ‌రికి ఆ అజ‌య్ దేవ్ అనే వ్య‌క్తి జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్తేన‌ని, వైయస్‌ఆర్‌సీపీకి సంబంధంలేద‌ని ఆయ‌న సోద‌రితోపాటు గ్రామ ఎంపీటీసీ అమ‌ర్ కూడా మీడియా ముందు ధృవీక‌రించారు. అత‌డి చేతి మీద ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌చ్చ‌బొట్టు ఫొటోలు, అజ‌య్ దేవ్ సోష‌ల్ మీడియా ఖాతాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిగా, జ‌న‌సేన కార్య‌కర్త అని స్ప‌ష్టం చేసే వీడియోలు, ఫొటోల‌ను వైయస్‌ఆర్‌సీపీ నాయ‌కులు బ‌య‌ట‌పెట్ట‌డంతో లోకేష్ తాను త‌వ్విన గోతిలో తానే ప‌డిపోయాడు. లోకేష్ కుట్ర‌ల‌కు జ‌న‌సేన కార్య‌కర్త బ‌లైపోయాడ‌ని ప్ర‌జ‌లంద‌రికీ అర్థ‌మైపోయింది. పొలిటిక‌ల్ ఎజెండాతో ఒక వ్య‌క్తి నిందితుడైనా స‌రే ఇలా దారుణంగా కొట్టి న‌డిరోడ్డుపై చెప్పులు లేకుండా న‌డిపించుకుంటూ తీసుకెళ్ల‌డం త‌ప్పు కాదా? ఇది రాజ్యాంగ ఉల్లంఘ‌న కాదా? వ‌్య‌క్తి స్వేచ్ఛ‌ను హ‌రించ‌డం కాదా? 

● సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై రాజ‌ద్రోహం కేసులు

త‌న దివ్యాంగురాలైన (చెవిటి, మూగ‌) త‌న కూతురికి హైద‌రాబాద్‌లో ఆప‌రేష‌న్ జ‌రుగుతుంటే సౌదీ అరేబియా నుంచి బ‌ద్దం భాస్క‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి ఎయిర్‌పోర్టుకు వ‌స్తే అత‌నిపై  సోష‌ల్ మీడియా పోస్టులు పెట్టాడ‌నే కార‌ణంతో 10 కేసులు బ‌నాయించారు. తీవ్ర‌మైన నేరాల‌కు పాల్ప‌డే వారికిచ్చే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వ‌దిలేయాల్సిన కేసుల్లో పొలిటిక‌ల్ అజెండాతో పోలీసులు రిమాండ్ కోరినా కోర్టులు తిర‌స్క‌రించాయి. ఒక‌వైపు కూతురి ఆప‌రేష‌న్ కోసం వ‌స్తే ఆస్ప‌త్రికి వెళ్లి చూడ‌నీయ‌కుండా ఎనిమిది రోజుల‌పాటు రాష్ట్రమంతా తిప్పి దారుణంగా వేధించారు. గ‌తంలో సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల మీద ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ కింద బీఎన్ఎస్ 111 సెక్ష‌న్ కింద కేసులు పెట్టేవారు. దాన్ని జ‌డ్జిలు వ్య‌తిరేకించ‌డంతో వెన‌క్కి త‌గ్గి, గంజాయి కేసులు పెట్ట‌డం మొద‌లైంది. దానిపై కూడా ఒక వ్య‌క్తి సుప్రీంకోర్టుకి వెళ్ల‌డంతో సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌పై ఇప్పుడు రాజ‌ద్రోహం కింద కేసులు పెడుతున్నారు. భార‌త‌దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదా ప్రేరేపించ‌డం, ఇరు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం సృష్టించేలా మాట్లాడ‌టం, అంత‌ర్గతంగా దేశంలో తిరుగుబాటుకు ప్ర‌యత్నించ‌డం లాంటి సంద‌ర్భాల్లో పెట్టే రాజ‌ద్రోహం కేసులు పెట్టాల‌ని రాజ్యాంగం చెబుతోంది. కానీ పొలిటిక‌ల్ ఎజెండాతో సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లకు బెయిల్ రాకుండా చేయాల‌ని ఈ విధంగా అక్ర‌మ కేసులు పెట్టి జైలుకు పంపే కుట్ర‌లు కూటమి ప్ర‌భుత్వం చేస్తుంది. 

● పోలీసులే చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు

తిరుప‌తిలో ద‌ర్శ‌నం టికెట్ల టోకెన్‌ల కోసం వెళ్లిన భ‌క్తుల అవ‌స్థ‌లను వివ‌రించేలా అక్క‌డి సంఘ‌ట‌న‌ను ఫొటోలు తీసిన సాక్షి ఫొటోగ్రాఫ‌ర్ నుంచి పోలీసులు సెల్‌ఫోన్ లాక్కున్నారు. ప‌త్తికొండ‌లో కోర్టు హాల్‌లో ముద్దాయి స‌రెండ‌ర్ అయితే న్యాయ‌వాది స‌రెండ‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. దానికి మెజిస్ట్రేట్ చెక్ అండ్ పుట్ అప్ అని రాశారు. లొంగిపోయిన వ్య‌క్తిని అరెస్ట్ చేయ‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ కోర్టు హాల్‌లో ఉన్న వ్య‌క్తిని చిప్ప‌గిరి ఎస్సై స‌తీష్‌, ప‌త్తికొండ ఎస్సై విజ‌య్‌కుమార్‌లు సిబ్బందితో వెళ్లి చొక్కా ప‌ట్టుకొచ్చి ఈడ్చుకుని తీసుకునివెళ్లారు. దాన్ని నిర‌సిస్తూ న్యాయ‌వాదులు నిర‌స‌న తెలిపినా పోలీసులు లెక్క చేయ‌లేదు. మేం ఎవ‌రికీ భ‌య‌ప‌డం అని న్యాయ‌వాదుల‌ను హెచ్చ‌రిస్తూ వెళ్లారంటే.. పోలీసులే ఏ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారో స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది. పొలిటిక‌ల్ బాస్‌ల అండ‌తో పోలీసులు చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రెచ్చిపోతున్నారు. పోలీసులు సివిల్ డ్రెస్‌లో వెళ్లి అరెస్టులు చేయ‌డాన్ని కూడా కోర్టులు ఎన్నోసార్లు అక్షేపించినా వారు లెక్క‌చేయ‌డం లేదు. కోర్టు ఆదేశాల‌ను ఖాత‌రు చేయ‌కుండా పోలీసులు యథేచ్చ‌గా డ్రెస్ కోడ్ నిబంబ‌ధ‌న‌లు ఉల్లంఘిస్తున్నారు. చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే భ‌క్ష‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోలీసుల అరాచ‌క‌ వైఖ‌రిని నిర‌సిస్తూ ప‌త్తికొండ‌లో న్యాయ‌వాదులు అక్క‌డే నిర‌స‌నకి దిగారు.  

● 20 పొట్టేళ్ల త‌ల‌ల‌తో బాల‌కృష్ణ క‌టౌట్‌కి హారం 

బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత టీడీపీ కార్య‌క‌ర్త‌లు బాల‌కృష్ణ క‌టౌట్‌ల‌కు పొట్టేళ్ల త‌ల‌ల‌ను హారంగా చేసి వేలాడ‌దీశారు. మొత్తం 20 పొట్టేళ్ల‌ను న‌రికి ఆ త‌ల‌ల‌ను హారంగా వేశారు. కానీ వైయ‌స్ జ‌గ‌న్ గారి పుట్టిన‌రోజు సంద‌ర్భాన్ని వేడుక‌గా చేసి కోళ్లు పొట్టేళ్లు, మేక‌లు కోసుకుని విందు చేసుకుంటే అక్ర‌మ కేసులు పెట్టారు. అధికారంలో ఉన్నామ‌న్న అహంకారంతో ఏం చేసినా చెల్లుబాట‌వుతుంద‌నే ధోర‌ణితో పోలీస్ వ్య‌వస్థ‌ను పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టించింది. ఇప్ప‌టికైనా ఇలాంటి పోలీసులు త‌మ తీరు మార్చుకోవాలి. వ్య‌వ‌స్థ‌లు నాశ‌నం అయిపోతే వాటిని పున‌ర్‌నిర్మించుకోవ‌డం ఎంత క‌ష్ట‌మో గ్రహించాలి. ఇప్పుడు ఎలాగైతే జ‌రుగుతుందో రాబోయే వైయస్‌ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలోనూ ఇలాగే చేస్తే రాష్ట్రంలో అశాంతి వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని కూట‌మి నాయ‌కులు గుర్తుంచుకోవాలి. ప‌త్తికొండ, క‌దిరి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌పై త‌క్ష‌ణం కేసులు న‌మోదు చేయ‌డంతోపాటు వారిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలి. 

అస‌త్య ప్ర‌చారంతో స‌మాజంలో వైయస్‌ఆర్‌సీపీ మీద బుద‌ర‌జ‌ల్ల‌డానికి ఈ ప్ర‌భుత్వం చేయ‌ని కుట్రంటూ లేదు. దానికి ఎల్లో మీడియా వంత‌పాడుతోంది. మంత్రులు నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు త‌మ పీకుడు భాష ద్వారా వైయస్‌ఆర్‌సీపీ విష‌యంలో ఇలా చేయ‌మ‌ని పోలీసుల‌కు సందేశం పంపుతున్నట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. కూట‌మి నాయ‌కులు చేస్తున్న అవినీతి, ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు చేస్తున్న దురాగ‌తాలు, అత్యాచారాలు, దాడులు, రౌడీయిజంపై చ‌ర్య‌లు తీసుకోకుండా అవి వెలుగులోకి వ‌స్తుంటే దాన్నుంచి డైవ‌ర్ట్ చేయ‌డం కోసం వైయస్‌ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను అరాచ‌క‌వాదులుగా చిత్రీక‌రించే కుట్ర‌లకు తెర‌లేపారు. వైయస్‌ఆర్‌సీపీ హింస‌ను ప్రేరేపిస్తుంద‌ని ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంకేతాలు పంప‌డమే ఎజెండాగా క‌ట్టుక‌థలు అల్లుతున్నారని మనోహర్ రెడ్డి అన్నారు.
 

Back to Top