తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ మహాగోపురంపై తాగుబోతు చేసిన వీరంగం

టీటీడీ, కూటమి ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనం

 వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి ఆగ్ర‌హం 

దేవాలయాల పరిరక్షణ పేరుతో ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం చేతల్లో పూర్తిగా విఫలం

వీఐపీ దర్శనాలకే ప్రాధాన్యం ఇచ్చి సామాన్య భక్తులను పక్కనపెట్టారు

టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు నేతృత్వంలో పాలన గాడితప్పింది 

తిరుమల కొండపై మద్యం, మాంసం యథేచ్ఛగా లభిస్తున్నాయని, ఆలయాల్లో వరుస అపచారాలకు కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి

భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి డిమాండ్ 

తిరుప‌తి: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ మహాగోపురంపై ఒక తాగుబోతు ఎక్కి కలశాలపైకి వెళ్లి అక్కడున్న చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ వీరంగం చేసిన ఘటనపై  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయ‌న స్పందిస్తూ  ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ, “తిరుపతిలో మరొక ఘోర అపచారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుమడింపచేస్తామని, తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడతామని, దేవాలయాల పరిరక్షణకు నడుం బిగిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ చేతలు మాత్రం శూన్యం” అని తీవ్ర విమర్శలు చేశారు.

చంద్రబాబు పాలనలో తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోయిందని వ్యాఖ్యానించారు. వీవీఐపీల సేవలో టీటీడీ తరిస్తోందని, ఆలయ ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం పాలక మండలికి లేదని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు నేతృత్వంలో పాలన పూర్తిగా గాడితప్పిందని అన్నారు.

టీటీడీ ప్రధాన ఆలయాల్లో ఒకటైన గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురంపై ఒక తాగుబోతు కలశాల మీదకు వెళ్లి అక్కడున్న విగ్రహాలను తొక్కుతూ “నాకు మందు కావాలి” అని అరవడం ఘోరాతి ఘోరమైన అపచారమని పేర్కొన్నారు. ఈ ఘటనతో భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమైందో స్పష్టమవుతోందని అన్నారు.

మట్ల మహారాజుల కాలంలో నిర్మించిన, తిరుపతి పుణ్యక్షేత్రానికి ఐకానిక్‌గా నిలిచిన రాజగోపురంపై ఇలా జరగడం అత్యంత దుర్మార్గమని అభివర్ణించారు. ఈ వీరంగం చేసిన వ్యక్తి పవనానంద స్వాముల వారి వీరాభిమాని అని కూడా సమాచారం ఉందని తెలిపారు.

తిరుమల కొండపై మద్యం, మాంసం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, ఆలయాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను భయపెట్టి తిరుమలకు రాకుండా చేసి, అదే సమయంలో “అత్యంత సమర్థవంతంగా నిర్వహించాం” అని టీటీడీ గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు.

టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు సొంత టీవీ ఛానల్‌కు ప్రకటనలు ఇచ్చే వ్యాపారస్తులకు వీఐపీ దర్శనాలు కల్పించారని తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. బీఆర్‌ నాయుడు ఇచ్చే దర్శనాల లిస్ట్‌ను బయటపెట్టాలని, ఆయనకు వంతపాడే బోర్డు సభ్యులు ఎవరు, ఎన్ని రకాలుగా ఎంతమందికి దర్శనాలు కల్పిస్తున్నారో ప్రతిరోజూ టీటీడీ అధికారికంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఆలయాల పరిరక్షణను పక్కనపెట్టి, ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ఆలయాలను టీటీడీ స్వాధీనం చేసుకోవడం గతంలో ఎన్నడూ చూడలేదని విమర్శించారు. యనమల రామకృష్ణుడుకు సంబంధించిన తుని నియోజకవర్గంలోని ఒక గుడిని టీటీడీ ఎలా స్వాధీనం చేసుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

ఒక తాగుబోతు ఆలయ గోపురం ఎక్కడం అంటే భక్తుల మనోభావాలను ఎంతగా దెబ్బతీసిందో అర్థమవుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం వైదిక ధర్మాన్ని కాపాడడంలో విఫలమైందని, సీఎంవో నుంచి వచ్చే వీవీఐపీల సేవలోనే టీటీడీ నిమగ్నమైందని విమర్శించారు. కొండపై ఉన్న ఛానల్స్‌, పత్రికా విలేకరులను మేనేజ్‌ చేసి దర్శనాలకు సంబంధించిన నిజాలు బయటికి రానీయడం లేదని, ఇవన్నీ త్వరలో ప్రజల ముందుంచుతామని వైఎస్ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.

Back to Top