కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్ర‌స్తావ‌న ఏదీ?

బిహార్‌కు భారీ కేటాయింపులు..ఏపీపై ఎందుకీ వివ‌క్ష 

వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

తాడేప‌ల్లి: నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వినిపించ‌లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఆక్షేపించారు. విభ‌జిత రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేద‌ని, అమరావతి, రైల్వే జోన్‌, మెట్రో రైల్‌, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర‌ బ‌డ్జెట్‌లో ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వ చేత‌కానిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. టీడీపీకి ప్రస్తుతం 21 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చంద్రబాబు మీదే ఆధారపడి నడుస్తోందంటూ గొప్ప‌లు చెప్పుకుంటున్న నేత‌లు నిధులు తీసుకురావ‌డంలో ఘోరంగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం భారీగా కేటాయింపులు చేస్తుంద‌ని, ఏపీపై మాత్రం వివ‌క్ష చూపుతుంద‌ని పేర్కొన్నారు. కేంద్ర బ‌డ్జెట్‌పై బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స్పందించారు.

బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఏమ‌న్నారంటే

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడే పరిస్థితి ఉన్నప్పటికీ ఏపీకి ప్రత్యేక కేటాయింపులు, ప్రత్యేక ప్రాజెక్టులు లేవు. రాజకీయ అనివార్య పరిస్థితులను రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫ‌ల‌మైంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగంలో బిహార్ ప్ర‌స్తావ‌న ప‌దే ప‌దే వినిపించింది. పాట్నాలో ఉన్న ఐఐటీ ఆధునీకరణ, సమర్థత పెంపు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ,  ఈఆర్‌ఎం ప్రాజెక్టు, మకానా బోర్డు, ఒక ఎయిర్‌ పోర్టు ఆధునీకరణ, మరొక కొత్త ఎయిర్‌ పోర్టు నిర్మాణం.. ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకంగా బిహార్‌కు ప్రకటించింది.  

దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్‌ సీట్లు పెంచుతామని కేంద్రం ప్ర‌క‌టించింది. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్  వైద్యరంగంలో గొప్ప సంస్కరణలు తీసుకువ‌చ్చారు. ప్రతి జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ ఉండేలా ..రాష్ట్రంలో కొత్త‌గా  17 మెడికల్‌ కాలేజీ నిర్మాణాలను చేప‌ట్టారు. వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్య‌ల‌తో 2550 మెడికల్‌ సీట్లు రాష్ట్రానికి వస్తాయి. 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను నిర్వీర్యం చేసింది. కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తున్నా సరే..ఏపీకి వద్దంటూ లేఖలు రాసింది. పైగా ఆ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది.   
 

దేశవ్యాప్తంగా యాభైవేల స్కూళ్లలో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, ఏఐ లెర్నింగ్‌ కోసం ప్రత్యేక డిజిటల్‌ ఇనీషియేటివ్  కార్యక్రమాలు కేంద్రం తీసుకువ‌స్తోంది. ఇవన్నీ వైయస్ఆర్‌సీపీ  ప్రభుత్వంలోనే ప్రారంభమ‌య్యాయి.  చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ మూలనపడేసింది. తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు తీరని ద్రోహం చేసింది. కూట‌మి స‌ర్కార్ రాష్ట్రాన్ని తిరోగమనం పట్టిస్తోంది.

Back to Top