అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై శాసన మండలిలో చర్చ జరగాల్సిందేనంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై సభలో చర్చకు వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంతకు ముందు షార్ట్ డిస్కషన్‌కు ఒప్పుకుంది. ఈ క్రమంలో ఇవాళ శాసన మండలిలో ఎలాగైనా చర్చ జరిగేలా చూడాలని వైయస్ఆర్‌సీపీ ప్రయత్నిస్తోంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని సోమవారం మండలి చైర్మన్‌కు వాయిదా తీర్మానం అందజేసింది. అయితే.. ఈ వాయిదా తీర్మాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రారంభానికి ముందు నల్లకండువాలతో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ముందుకు సాగారు. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య: విపక్ష నేత బొత్స సత్యనారాయణ ‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఈరోజు చర్చ జరుపుతాం అన్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాటించరు?. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు కావాల్సిందే’’ అని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తక్షణం చర్చ జరగాలి అంటూ మండలి చైర్మన్ పోడియం చుట్టూ చేరి వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టు వీడకపోవడంతో ఆందోళన నడుమ.. చైర్మన్ మండలిని కాసేపు వాయిదా వేశారు.