తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు కలుషిత బుద్ధి మానుకొవడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . చింత సచ్చిన పులుపు చావలేదు ఆన్న సామెత చంద్రబాబు కోసమే పుట్టినట్టు ఉందంటూ సెటైర్లు వేశారు. కల్తీ రాజకీయాలు చేస్తారు కాబట్టే కల్తీ రాజకీయాలను నమ్ముకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘చింత సచ్చిన పులుపు చావలేదన్న సామెత మన ముఖ్యమంత్రి చంద్రబాబు కోసమే పుట్టినట్లు ఉన్నది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సుప్రీం కోర్టు చంద్రబాబు సిట్‌ను కాకుండా సీబీఐ సారథ్యంలో నూతన సిట్ ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ విమర్శలు వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా తన కలుషిత బుద్ధి మానుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీకి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేసిన సందర్భాన్ని కూడా తన మీడియాతో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డు అని ముఖ్యమంత్రి అంటే ప్రధాని సంతోషించారంటూ కల్తీ వార్తలు ప్రచారంలో పెట్టారు. తాను మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతుంది కనుక తన మీడియాతో కల్తీ కథనాలు ప్రచారంలో పెట్టారు. కల్తీ రాజకీయాలను చెసే వారు గనుక కల్తీ ప్రచారాన్ని నమ్ముకున్నట్లున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.