విశాఖ: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లిన కంటైనర్‌పై ప్రతిపక్షాలు, ఎల్లోమీడియాఅనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది ? అంటూ ఈనాడు ఓ కథనం ప్రచురించింది. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, అలాగే బయటకు వచ్చిందని, భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలంటూ.. రకరకాల డైరెక్షన్‌లలో కంటెయినర్‌ను హైలెట్ చేస్తూ ఓ గాలి వార్త రాసేసింది. ఇంకేం ఐ-టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. తమకు చెందిన అకౌంట్లతో ఏవేవో ట్వీట్లు వేయించింది. దీనికి తోడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు.. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ సంగతేంటి?’’ అంటూ ఓ ట్వీట్ కూడా వేశారు. దానికి ఆ ఈనాడు పేపర్ కట్టింగ్ క్లిప్పులను జత చేశారు. వాస్తవం ఏంటంటే.. బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామానులు తీసుకు వచ్చింది ఆ పాంట్రీవాహనం. దీనిపై ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న రాద్దాంతంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. వంటసామానులు తీసుకెళ్లే వాహనంపై దుష్ప్రచారం చేయడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైజాగ్ పోర్ట్ కు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ నారా లోకేష్ బంధువులదే అని ఆరోపించారు.. అందుకే ఏ కంటైనర్ చూసినా వారికి అనుమానం వస్తుందని దుయ్యబట్టారు.. దొడ్డి దారిలో మంత్రి అయిన నారా లోకేష్ కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేమని హాట్ కామెంట్లు చేశారు. మరోవైపు, బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులుగా ఓసీలు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్‌లకు టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలి? అని నిలదీశారు. వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీలకే పోటీ చేసే అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర లో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారంలో ఎండగడతామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పరు. మంచి చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. గత 58 నెలల్లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని, సీఎం వైయస్ జగన్‌ను ఏరకంగా బద్నాం చేయాలి? అనే ఆలోచనతోనే కుట్రలు పన్నుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ తమ అసత్య ప్రచారాల మోతాదును ఒక్కసారిగా పెంచేశారని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.