అమరావతి: ఎన్నికల హామీలను గాలికొదిలేసిన అసమర్ధ ప్రభుత్వం ఇది అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఉద్ఘాటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో మండలిని మారుమోగిపోయేలా చేశారు. ఈ క్రమంలో మార్షల్స్‌ను ప్రయోగించే ప్రయత్నం చేయగా.. ఆ ప్రయత్నానికి నిరసనగా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఇది అసమర్థ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. సభలో వారి కోసం ఆందోళన చేశాం. తొమ్మిది నెలలైనా రియింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?. మా హయాంలో ఫీజు రియింబర్స్‌మెంట్‌లో బకాయిలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ, మా హయాంలో ఎక్కడా బకాయిలు లేవు. దమ్ముంటే.. ఎక్కడున్నాయో చూపించండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారాయన. నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు.. అది ఏది?. పోని ఎప్పుడిస్తారో అదైనా చెప్పండి?. జాబ్ కాలండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. మెగా డీఎస్సీ అన్నారు.. అదీ ఇవ్వలేదు. మరోవైపు గ్రూప్-2 అభ్యర్థులను దారుణంగా మోసం చేశారు. కానీ గత వైయస్ఆర్‌సీపీ హయాంలో మేం శాశ్వత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. అలాంటి మేం ఇప్పుడు విద్యార్థులు, యువత కోసం నినదిస్తే.. మా మీదే మార్షల్స్ ని ప్రయోగిస్తారా?. ఇదేం సంస్కృతి అని మండిపడ్డారాయన. అంతకు ముందు.. మండలి ప్రారంభానికి ముందు నిరుద్యోగ భృతి విడుదల, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వగా, చైర్మన్ దానిని తిరస్కరించారు. అయినప్పటికీ వైయస్ఆర్‌సీపీ చర్చకు పట్టుబట్టింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు నిరుద్యోగ భృతి రూ.3 వేలు తక్షణమే చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో చైర్మన్ మూడుసార్లు మండలిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, బాబు షూరీటీ.. మోసం గ్యారెంటీ అంటూ వైయస్ఆర్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు.