ఢిల్లీ చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

న్యూఢిల్లీ: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. 24న ఢిల్లీలో ధ‌ర్నా నేప‌థ్యంలో ఉద‌యం గ‌న్న‌వ‌రం నుంచి బ‌య‌ల్దేరిన వైయ‌స్ జ‌గ‌న్ కాసేపటి క్రిత‌మే ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, అభిమానులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. వైయ‌స్ జ‌గ‌న్ వెంట ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య‌నేత‌లు ఉన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను వివ‌రించేందుకు ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర హోంమంత్రి స‌హా ప‌లువురి అపాయింట్‌మెంట్లు కోరారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు.

రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులు, విధ్వంసాల‌కు నిర‌స‌న‌గా 24వ తేదీన ఢిల్లీలో ధ‌ర్నాకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో వైయ‌స్ఆర్ సీపీకి చెందిన ముఖ్య నేత‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్నారు. దేశ ప్రజలకు ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలు తెలిసేలా వైయ‌స్ఆర్ సీపీ రేపు ధర్నా చేపడుతోంది. ధర్నాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరుగుతున్న హింసల‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించనున్నారు. 

Back to Top