రాజధాని అంటే నగరాల నిర్మాణం కాదు

మూడు రాజధానులపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది

రాజధాని అంటే శాసన సభ, సచివాలయం, ముఖ్య కార్యాలయాలు

సహజంగానే సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు

కేంద్రీకృత అభివృద్ధితో మనం ఇబ్బంది పడ్డాం

రైతుల ముసుగులో చేరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు

సామాన్య ప్రజలు, రైతులకు నష్టం జరిగేలా ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: రాజధాని అంటే పట్టణాల నిర్మాణం కాదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌, మద్రాస్‌, బెంగళూరు నగరాలను ఎవరైనా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రీకృతమైన అభివృద్ధి వల్ల మనం నష్టపోయామని చెప్పారు. మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో పరిపాలన భవనాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందన్నారు. రైతుల ముసుగులో చేరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అంబటి రాంబాబు హెచ్చరించారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వ నిర్ణయం ఐదు కోట్ల ప్రజలకు మేలు చేస్తుందని వెల్లడించారు.  తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 
రాజధానిపై ఒక అభిప్రాయాన్ని అసెంబ్లీ వేదికగా వైయస్‌ జగన్‌ తెలియజేశారు. ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం రావచ్చు అని, రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లో రాయలసీమ, కోస్తాంధ్రా, ఉత్తరాంధ్రలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, కర్నూలులో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌, అమరావతిలో లెజిస్టేటివ్‌ క్యాపిటల్‌, ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఇస్తుందని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. దానిపై చాలా చోట్ల హర్షం వ్యక్తమవుతోంది. అధికార వికేంద్రీకరణ అన్నది అభివృద్ధి చెందుతున్న సమాజంలో చాలా అవసరమని, ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరగడం, సంపద పెరగడం సమంజసం కాదని దేశవ్యాప్తంగా ఒక మంచి కాన్సెప్ట్‌ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. మాజీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి ఒక సంపద సృష్టించే నగరమని, దాన్ని సింగపూర్‌, మలేషియా మాదిరిగా నిర్మిస్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. రాజధానిని మార్చేస్తారా..ఇది తుగ్లక్‌ పరిపాలన అంటున్నారు. మేం ఏం చేసినా ఇది సాధ్యం కాదన్నారు. మేం మద్యపానాన్ని నిషేదిస్తామంటే సాధ్యంకాదన్నారు. మళ్లీ చూస్తే అది సాధ్యమయ్యే విధంగా వైయస్‌ జగన్‌ చేస్తున్నారు. ఇది సాధ్యం కాదని ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చంద్రబాబు గతంలో చాలాసార్లు చూశాం. ఆయనకు సపోర్టు చేసే పవన్‌ కళ్యాణ్‌ కూడా నిన్న మాట్లాడుతూ..తినడానికి మెతుకు లేకపోతే కొడుకొచ్చి పరమాన్నం కావాలని మాట్లాడారు. పవన్‌కు తెలిసి మాట్లాడారో..తెలియక మాట్లాడారో నాకు అర్థం కావడం లేదు. వీరిలో తండ్రి ఎవరో, కొడుకు ఎవరో అర్థం కావడం లేదు. ఇందులో పరమాన్నం కావాలని తాపత్రయ పడుతున్న తండ్రి చంద్రబాబు..తినడానికి మనకు మెతుకు లేదు నాయనా..దీన్ని సక్రమంగా ఉపయోగించుకుందాం. అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు పెట్టే శక్తి మనకు లేదు. ఆర్థికంగా చితికిపోయిన ఈ ప్రభుత్వం ..తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే..మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుందామని మేం చెబుతుంటే..ఆయనేమో పరమాన్నం కావాలని పవన్‌ కోరుతున్నారు. అమరావతికే దిక్కు దిమానం లేదంటున్నారు. మూడు ఎలా కడుతారని పవన్‌ అంటున్నారు. వారు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ..మూడు నగరాలను ఎవరూ నిర్మించరు. రాజధాని అంటే నగరాలు నిర్మించడం అనే కాన్సెప్ట్‌ తప్పు. రాజధాని అంటే ఒక శానస సభ, ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్‌, వారు నివాసించే ఇళ్లు. ఇది రాజధాని అంటారు. చంద్రబాబు అలాంటి కాన్సెప్ట్‌లోకి తీసుకెళ్లారు. హైదరాబాద్‌ను రాజధానిగా ఎవరైనా నిర్మించారా?. హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకొని మనం నిర్మించుకున్నాం. అక్కడ ఉన్న భవనాలు వాడుకున్నాం. రాజధాని అంటే భవన నిర్మాణాలు కాదు..అడ్మినిస్ర్టేషన్‌కు సంబంధించిన కొన్ని భవనాలు నిర్మించి అక్కడ అధికారం చలాయించడమే. మద్రాస్‌, బెంగుళూరును ఎవరైనా నిర్మించారా?. మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతంలో అసెంబ్లీ, సెక్రటరీయట్‌, హైకోర్టు ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే ..వికేంద్రీకరణను మేం నమ్ముతున్నాం. ఒకే చోట కేంద్రీకృతమైన పరిస్థితులను గతంలో చూశాం. హైదరాబాద్‌లో అన్ని ఒకే చోట ఉన్నాయి. హైదరాబాద్‌ను వదిలి వచ్చే సమయంలో ఏమీ లేకుండా తిరిగి రావాల్సిన పరిస్థితి చూశాం. హైదరాబాద్‌కు పోటీగా మరొక నగరాన్ని మనం నిర్మించుకుని ఉంటే మనకు ఈ ఇబ్బంది ఉండేది కాదు. వికేంద్రీకరణ అవసరం. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానులు అవసరమని అభి‌ప్రాయపడ్డారు. 
చంద్రబాబు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆ రోజే  ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే మళ్లీ ప్రజలు ఆయన్ను గెలిపించే వారు. విభజన తరువాత ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ఎవరికి వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. అలా కాకుండా పట్టణాలను, అద్భుతమైన నగరాలను నిర్మిస్తామని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తామని చంద్రబాబు ప్రకటనలు చేయడం పాలకుల పద్ధతి కాదు. పాలకులు పరిపాలన చేయాలే తప్ప..వ్యాపారం చేయకూడదు. అమరావతి ఒక భారీ కుంభకోణం. ఇది మేం చెప్పిందే కాదు..అనేక మంది మేధావులు చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన మనషులు వేలు, లక్షల కోట్లు కాజేయాలని భూములు లాక్కున్నారు. దౌర్జన్యంగా లాక్కున్నారు. డబ్బులు పెట్టి భూములు కొన్నారు. వలయంగా ఏర్పడి కాజేయాలని కుట్రలు చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు 4070 ఎకరాలు కొనుగోలు చేశారు. అమరావతి సంపద సృష్టి అంటున్నారు. ఎవరికి సంపద? అమరావతి..మీ సంపద, మీ బినామీల సంపద సృష్టి కోసం ఏర్పాటు చేశారు. బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను చంద్రబాబు బినామీలు పావలా, అర్ధరూపాయికి కొనుగోలు చేసి, అక్కడ ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు. చంద్రబాబు తనకు సంబంధించిన వ్యక్తుల కోసం అడ్డగోలు జీవోలు ఇచ్చారు. అమరావతిని కుంభకోణంగానే చూడాలి. దాన్ని ప్రజారాజధాని అనడం పెద్ద బూటకం. రైతుల పేరుతో చాలా మంది ఇవాళ ఆందోళన చేస్తున్నారు. చూపించే చానల్స్‌, మాట్లాడే వ్యక్తులను గమనించండి. నిజంగా ఎవరైతే రైతులు ఉన్నారో..వారికి మేలు చేసేలే మాట్లాడటం లేదు. చాలా మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మరికొంత మంది వద్ద దౌర్జన్యంగా లాక్కున్నారు. భూములిచ్చిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఓట్లు వేసినా, వేయకపోయినా..వారికి నష్టం జరిగితే న్యాయం చేస్తాం. వ్యక్తిగత దూషణలకు దిగి వైయస్‌ జగన్‌ను అనరాని మాటలు అంటే..రైతుల ముసుగులో విమర్శిస్తే సహించేది లేదు. ఈ ప్రభుత్వం ప్రజా రంజక నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని ప్రాంతాలకు మేలు చేయాలనే తాపత్రయం మాకుంది. అది చంద్రబాబు దుర్భుద్ది, ప్రజా రంజక పాలన చేయకపోతే చంద్రబాబుకు పట్టిన గతే ఎవరికైనా పడుతుంది. ఆ విషయం మాకు బాగా తెలుసు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వైయస్‌ఆర్‌సీపీ, ఈ ప్రభుత్వం సహించదు. మేం తీసుకోబోయే నిర్ణయం ఐదు కోట్ల ప్రజలకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక్కడ అద్భుతాలు జరిగిపోతాయని చంద్రబాబు మాటలు నమ్మి వందలు, వేల ఎకరాలు కొనుగోలు చేసిన వారికి నష్టం జరుగుతుందని భావించవచ్చు. సామాన్య ప్రజానీకానికి, సామాన్య రైతులకు నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

 

Back to Top