తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా చీఫ్ పీఆర్‌ఓ పూడి శ్రీహారి అరెస్టును వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు . పార్టీకి చెందిన కీలక నాయకుడిని అక్రమంగా అరెస్టు చేసి కుప్పంకు తరలించడం ప్రభుత్వ దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “చీఫ్ పీఆర్‌ఓ పూడి శ్రీహరిని అరెస్టు చేశామని చెప్పుకుని సంబరాలు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి తూటాలు పొడిచినట్లే. అధికారంలో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు” అని మండిపడ్డారు. గతంలో పలువురు ప్రముఖులు కూడా చంద్రబాబు నైజంపై విమర్శలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. “ఎన్టీఆర్ కూడా చంద్రబాబును దుర్మార్గుడు అని పేర్కొన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో ఆయన వైఖరిని ప్రస్తావించారు. నాదెండ్ల భాస్కర్ రావు సహా పలువురు నాయకులు కూడా చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు” అని అన్నారు. “చంద్రబాబు రాజకీయ జీవితం అంతా వివాదాలతో నిండిపోయింది. ప్రజాస్వామ్య విలువలను కించపరుస్తూ వ్యవహరిస్తున్నారు” అని ఆరోపించారు. అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేరని స్పష్టం చేశారు. “మాకు ఎలాంటి వ్యక్తిగత కక్ష్యలు లేవు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాత్రమే మా పోరాటం కొనసాగుతుంది” అని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వెనక్కి తగ్గదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.