అమరావతి: అరసవిల్లికి మహాపాదయాత్రతో అమరావతి సమస్య ఒక్క రైతులదేనని తేల్చేశారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. మహా పాదయాత్రపై విజయసాయిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ‘ఏకైక రాజధాని’గా కొనసాగించాలంటూ అరసవిల్లికి బయల్దేరిన పాదయాత్ర– పూర్వపు తెలుగుదేశం ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన వ్యవహారంగా ప్రజలకు అర్ధమౌతోంది. అమరావతి అధికార హోదా మారితే తాము నష్టపోతామని అనుమానిస్తున్న రైతులు ఉత్తరాంధ్ర ఆలయ ప్రాంతానికి ఊరేగింపుగా వెళుతుండగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నేతలు వారికి మద్దతు పలుకుతూ జనసమీకరణ చేస్తున్నారు. అంతవరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. పాదయాత్రికులను అరసవిల్లికి పోయే దారిలో చూడడానికి గుమిగూడిన జనమంతా అమరావతికి మద్దతుదారులనే రీతిలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుగారి పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అమరావతి ఏకైక రాజధానిగా గాకుండా మూడు రాజధానుల్లో ఒకటిగా (శాసన రాజధాని) మారితే తమ ప్రయోజనాలు దెబ్బదింటాయనే రైతుల భయాందోళనలను సొమ్ముచేసుకునే ప్రయత్నాలు టీడీపీ చేస్తోంది. కాని, మహాపాదయాత్ర లక్ష్యం కేవలం స్థానిక రైతుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణనని ఏపీ ప్రజలకు అవగాహన కలుగుతోంది. అమరావతి పరిధిలోని పాతిక ముప్పయి గ్రామాల రైతుల ఆందోళనను ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా చిత్రించి రాజకీయ లబ్ధిపొందడానికి చంద్రబాబు గారి బృందం చేసే కుట్రలు ఫలించవు. ఒక జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజల సమస్య కనీసం ఆరు జిల్లాల ప్రజలను వేధించే సమస్యగా చూపెట్టడం టీడీపీ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. అమరావతిలో ప్రారంభమైన ‘మహాపాదయాత్ర’ ఇప్పటికి రెండు వారాలు దాటాక కూడా టీడీపీ, దాని అనుకూల మీడియా ఇదేదో తక్షణ సమస్య అనే రీతిలో కథలు, కథనాలు ప్రచారంలో పెట్టడం మానుకుంటే ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల జనం సంతోషిస్తారు. చట్టసభలు కొలువై ఉన్న అమరావతిని ఉద్రిక్తలకు కేంద్ర బిందువుగా మార్చినందువల్ల అందరికీ నష్టమే అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.