రాష్ట్ర అభివృద్ధి, ప్ర‌జా ప్ర‌యోజ‌నాలే మాకు ముఖ్యం

అందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా వ్యతిరేకిస్తాం, పోరాడుతాం

అదే మా ఆశయం.. ఆ వైపుగా అందరం పయనిస్తాం

సీఎం వైయస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటాం

వైయస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ అభ్యర్థి విజయసాయిరెడ్డి

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల మేరకు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభ నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సమన్వయం చేసుకుంటూ ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. రాజ్యసభ రాష్ట్రాల సభ కాబట్టి రాష్ట్రానికి  సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషిచేస్తామన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విధి విధానాలను అనుసరిస్తామన్నారు. 

‘కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారే కానీ, బీజేపీని విమర్శించడం లేదని చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారని, దానికి ఒక్కటే సమాధానం.. అది కాంగ్రెస్‌ అయినా, బీజేపీ అయినా మా అందరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య అయినా వైయస్‌ఆర్‌ సీపీ ముందుండి ఉద్యమం చేస్తుంది. అది ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినా, ఏ ఇతర పార్టీ వ్యవహరించినా దాన్ని వ్యతిరేకిస్తాం. 

లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నిక పూర్తయిన తరువాత మా సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరుతుంది. వీరిలో 5మంది బీసీ సామాజికవర్గానికి చెందినవారు, నలుగురు మిగతా సామాజిక వర్గాలకు చెందినవారు ఉంటారు. సీఎం వైయస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సామాజిక వర్గాలను మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి పరిచేవిధంగా, మా పార్టీ ప్రతి పథకం ఉంటుంది. మా పనితనం కూడా అదేరకంగా ఉంటుంది. కేంద్రంతో ఏ సమస్య మీద అయితే పోరాడాలో.. దానిపైనే పోరాడాలి కానీ, ప్రతిపక్షం, చంద్రబాబు చెప్పినట్టుగా ప్రతిదానిపై కేంద్రంపై పోరాడటం కరెక్ట్‌కాదు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమో.. వాటిపైనే కేంద్రంతో పోరాడాలి. రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేయాలి. అదే మా ఆశయం.. ఆ వైపుగా అందరం పయనిస్తాం’ అని విజయసాయిరెడ్డి అన్నారు.  
 

Back to Top