ఢిల్లీ: తాలిబన్ల కంటే హీనమైన టెర్రరిస్ట్ అవుట్‌ఫిట్.. తెలుగు దొంగల పార్టీగా తయారైన టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరామని వైయస్‌ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైయస్‌ఆర్ సీపీ ఎంపీలు సీఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై, రాష్ట్ర పోలీసులపై, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. తెలుగు దొంగల పార్టీగా తయారైన టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఈసీతో భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి, దేవినేని ఉమ, నారా లోకేశ్, బోండా ఉమ, అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను వివరంగా గౌరవ ఎన్నికల కమిషనర్లకు వివరించడం జరిగిందన్నారు. ఆ మాటలు విని ఎన్నికల కమిషనర్లు ఆశ్చర్యపోయారన్నారు. నాగరిక సమాజంలో అనాగరికమైన భాషను వాడిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని సీఈసీని కోరామన్నారు. అసభ్యంగా మాట్లాడిన వారిపై కేసులు పెట్టారా అని ఎన్నికల కమిషనర్లు అడిగారని, కేసులు పెడితే ఎఫ్‌ఐఆర్ కాపీలను పంపించాలని సూచించారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ ఉగ్రవాదులకు స్థానంలేదన్నారు. ఇదొక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఖాళీగా ఉన్న 14 స్థానాల్లో 11 స్థానాలకు స్థానిక సంస్థల నుంచి ఎన్నికబడిన వారు ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారని, ఎమ్మెల్యేలు ఎన్నుకునే మూడు స్థానాలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీనికి ఎన్నికల కమిషనర్లు సానుకూలంగా స్పందించారు.