కార్పొరేట్ కంపెనీల టాక్స్ ఎగవేతపై చర్యలేమిటి?

కేంద్ర ఆర్థిక మంత్రిని ప్రశ్నించిన వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నందున దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేమిటో వివరించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థలైన డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), ఆదాయ పన్ను శాఖ, జీఎస్టీ వంటి సంస్థలు కస్టమ్స్‌ సుంకాన్ని ఎగవేసిన పలు మొబైల్ కంపెనీలకు నోటీసులు జారీ చేశాయి. కార్పోరేట్ కంపెనీలు టాక్స్‌లు, కస్టమ్స్‌ డ్యూటీ చెల్లింపులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. 

అలాగే కార్పొరేట్‌ కంపెనీలు ఎగవేసిన పన్నుల మొత్తం ఏమేరకు ఉన్నాయో ప్రభుత్వం మదింపు చేసిందా అని కూడా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్రశ్నించారు. పన్నులు ఎగవేసిన తర్వాత నోటీసులు జారీ చేయడం కంటే కార్పొరేట్ సంస్థలు నిర్ణీత సమయంలో సుంకాలు, పన్నులను తప్పనిసరిగా చెల్లించే విధంగా ప్రభుత్వం  చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నలకు ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ జవాబిస్తూ గౌరవ సభ్యులు చేసిన సూచనతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. పన్నుల ఎగవేతకు సంబంధించి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా అంగీకరిస్తూనే, కార్పొరేట్‌ కంపెనీల కస్టమ్స్ డ్యూటీ ఎగవేత ఏమేరకు ఉందో ప్రభుత్వం మదింపు చేయలేదని తెలిపారు.

Back to Top