తాడేపల్లి: అశేష ప్రజాదరణ కలిగిన నాయకుడుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ అన్నారు. ఈ మూడేళ్ల ప్రజా పాలనలో ముఖ్యంగా, రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా, భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ జరగని విధంగా పరిపాలన కొనసాగిస్తూ, బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం అనే పదానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు సంపూర్థ అర్థాన్ని తీసుకొచ్చారని అభివర్ణించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన `సుపరిపాలనకు మూడేళ్లు` కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎంపీ మోపిదేవి వెంకట రమణ ఇంకా ఏం మాట్లాడారంటే.. అంబేద్కర్ కన్నకలలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్నాయి. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలంటే వారి అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌తో ఆర్థిక వ్యవస్థ అంతా ఛిన్నాభిన్నం అయినా, ఎక్కడా వెనకడుగు వేయకుండా, పేదవాడికి సాయం చేయడానికి ఆర్థిక వ్యవస్థలు సహకరించాల్సిన అవసరం లేదని, మనసు ఉంటే మార్గం ఉంటుందనే తనదైన ఆలోచనతో పరిపాలన చేస్తున్న గొప్ప నాయకుడు సీఎం వైయస్ జగన్. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారు. గత ప్రభుత్వాలు దళితులను, బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తే... వైయస్ జగన్ అధికారం చేపట్టాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నిరంగాల్లో సముచిత స్థానం కల్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల్లో మార్పు తీసుకువచ్చి వారికి గౌరవంతో పాటు, ఆర్థికంగా, రాజకీయ స్వావలంభన కల్పించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఆధునిక పరిపాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టడమే కాకుండా, సంక్షేమ కార్యక్రమాలకు రోల్ మోడల్‌గా నిలిచారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న పరిపాలనా విధానాలు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అందుకు ఉదాహరణగా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మంచి స్పందనను చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ నాయకత్వంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని ప్రతి పేదవాడు భావిస్తున్నాడు. ప్రజలంతా సీఎం వైయస్ జగన్ నాయకత్వం కొనసాగాలని ఆశిస్తున్నారు.