ఢిల్లీ: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా మాపైన కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలకు భయపడేది లేదని వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు మాపై చేసిన వరుస ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజమని వారి దర్యాప్తులో నిరూపించలేక పోయారని అన్నారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ వైయస్ జగన్ గారికి అండగా నిలుస్తున్న నేతలను దెబ్బతీయాలనే లక్ష్యంతో రాజకీయంగా చేయిస్తున్న ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి కేవలం కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోంది. తెలుగుదేశంకు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడిగా నాపైనా రకరకాల ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ప్ దగ్ధం ఘటనలో మాపైన బుదరచల్లారు. రెవెన్యూ కార్యాలయంలో ఫైల్స్ అనేవి ఫిజికల్ గానే కాదు, ఆన్‌లైన్ లోనూ ఉంటాయి. అలాగే ఒక్క ఆర్డీఓ కార్యాలయంలోనే అన్ని ఫైల్స్ ఉండవు, వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కూడిన ఫైల్స్ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఉంటాయని మేం పదేపదే చెప్పాం. అయినా కూడా రాజకీయ దురుద్దేశంతో మాపైన దుష్ర్పచారం చేసేందుకే కూటమి ప్రభుత్వం తెగబడింది. ఫలానా భూమి కోసం ఇలా చేశారని మాపైన నిర్ధిష్టమైన ఆధారాలను ఉంటే చూపండి అని మేం గతంలో అనేక సార్లు ప్రశ్నించినా కూడా దానిపైన ఎవరూ సమాధానం చెప్పలేదు. ఈ ఘటనలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న గౌతమ్ తేజ్ అనే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ మా కుటుంబం అంతా తెలుగుదేశం సానుభూతిపరులం, చంద్రబాబు మాకు బంధువు కూడా అవుతారు, మా కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వాపోయారు. మదరపల్లి ఫైల్స్ దగ్ధం అంటూ చేసిన దర్యాప్తులో ఇప్పటి వరకు ప్రభుత్వం తేల్చింది శూన్యం. అసలు భూ అక్రమాలే లేనప్పుడు ఆ భూముల రికార్డులు ఎవరు దగ్ధం చేస్తారు? ఎవరికి అవసరం? కరుడుగట్టిన నేరస్తులకు నిజాలు తెలుసుకునేందుకు సత్యశోధన పరీక్షలు చేస్తుంటారు, మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న గౌతమ్ తేజ్ కు కూడా పోలీసులు సత్యశోధన పరీక్ష చేయించారు. దానిలో కూడా గౌతమ్ తేజ్ కుట్రపూరితంగా వ్యవహరించాడని కానీ, నేరం చేసినట్లుగా కానీ నిరూపితం కాలేదు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఒక గంట ముందే అతడు ఇంటికి వెళ్ళిపోయాడు, సీసీ కెమేరాల్లో కూడా ఇది రికార్డు అయ్యింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనిని రాజకీయం చేయాలనే దురుద్దేశంతోనే హుటాహుటిన డీజీపీని హెలికాఫ్టర్ లో పంపడం, రెవెన్యూ కార్యదర్శిని పంపడం, చంద్రబాబు, మంత్రులు దీనిపై నిత్యం మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వారి వైఫల్యం నుంచి దృష్టి ళ్లించేందుకే ఇటువంటి దుర్మార్గానికి తెగబడ్డారు. ఆ రోజే ఇదంతా అవాస్తవమని చెప్పాం. ఈ రోజు సత్యశోధన పరీక్షలోనూ అదే నిర్ధారణ అయ్యింది. మైనింగ్‌పైనా తప్పుడు ఆరోపణలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనింగ్ లో గత ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు దోచేసిందంటూ ఆరోపణలు చేసింది. రెండు నెలల పాటు మైనింగ్ కార్యాలయాలను సీజ్ చేసి, పోలీసుల భద్రత మధ్య తనిఖీలు చేయించారు. మరి వారి దర్యాప్తులో ఏం తేల్చారో స్పష్టం చేయాలి. కూటమి ప్రభుత్వం చేసిన వేల కోట్ల రూపాయల ఆరోపణల్లో కనీసం ఒక్క రూపాయి అయినా అక్రమం జరిగినట్లు, దోపిడీ జరిగినట్లు గుర్తించారా? వందలాది మైన్లలో అక్రమాలు అన్నారు, ఒక్క మైన్ లో అయినా తప్పు జరిగినట్లు తేల్చారా? వీటిపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఎర్రచందనం అక్రమ రవాణాతో మాకు సంబంధం ఉందంటూ కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి ఆరోపించారు. అదేరోజు మేం దానిని నిరూపించాలని సవాల్ చేశాం. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాం. దీనిపైనా వారి నుంచి సమాధానం లేదు. అటవీభూమి కబ్జా అంటూ మరో అబద్దం తాజాగా డెబ్బై అయిదు ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామంటూ మా కుటుంబంపై మరో అబద్దపు ఆరోపణలను తెరమీదికి తీసుకు వచ్చారు. ఇవ్వన్నీ మా సొంత భూములే, 2000 సంవత్సరంలోనే రిజిస్టర్ అయినవని ఆరోజే అన్ని ఆధారాలను మీడియా ముందు చూపించడం జరిగింది. 75.76 ఎకరాల భూమి మా కుటుంబసభ్యులకు ఉందని చెప్పాం. ఈ రోజు ప్రభుత్వ ఆదేశాలతో జరిపించిన దర్యాప్తులోనూ, జిల్లా కలెక్టర్ నివేదికలోనూ ఎటువంటి కబ్జాలు జరగలేదని వారే నిర్ధారించారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, ఎల్లో మీడియా మాపైన పెద్ద ఎత్తున భూకబ్జా అంటూ దుమ్మెత్తి పోశారు. అవ్వన్నీ అబద్దాలని నిర్ధారణ జరిగిన తరువాత మౌనంగా ఉంటే సరిపోతుందా? ఇప్పటి వరకు మేం చేసింది తప్పేనని వారు బహిరంగంగా అంగీకరించాలి. లిక్కర్ స్కాం అంటూ కొత్త నాటకం ఈ రోజు లిక్కర్ స్కాం అంటూ మరో కొత్త నాటకంను ప్రారంభించారు. టీడీపీ ట్విట్టర్ లో మద్యం కుంబకోణంలో రూ.3000 కోట్లకు పైగా ఆక్రమాలకు పాల్పడినట్లు నాపైన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే చాలా పెద్ద కుంబకోణం అంటూ ప్రచారం ప్రారంభించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటుపరం చేయడం వల్ల స్కాం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోని మద్యం దుకాణాలను ప్రభుత్వమే తీసుకుని నిర్వహించింది. ఇందులో స్కాం ఎలా జరుగుతుంది? గతంలో రూ.యాబైవేల కోట్లు అక్రమాలని అన్నారు, తరువాత రూ.ముప్పై వేల కోట్లన్నారు, కాదు కాదు రూ.10వేల కోట్లు అంటూ వచ్చారు. ఇప్పుడు రూ.మూడువేల కోట్లు అంటూ కూటమి ప్రభుత్వం తమ తాజా ఆరోపణలకు ఒక మొత్తాన్ని ఖరారు చేసింది. ప్రతిసారీ ఇలా తప్పుడు ఆరోపణలతో మాపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. వైయస్ జగన్ గారిని దెబ్బకొట్టాలంటే ఆయన చుట్టూ ఉన్న నాయకులను బలహీనరపచాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలు ఇవి. ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడితే అంతే బలంగా వాటిని ఎదుర్కొంటాం. ఈ కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు. ఇటువంటి అరాచక విధానాలపై న్యాయపోరాటం చేస్తామని పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి స్పష్టం చేశారు.