మహిళల భద్రత కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దా?

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఫైర్ 

గుంటూరు:  కూట‌మి ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప.. మహిళల భద్రత గురించి పట్టించుకోవడం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు  కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి సొంత జిల్లాలో లా విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జ‌రిగితే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని మండిప‌డ్డారు.  కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.  శాసనమండలిలో వ‌రుదు క‌ళ్యాణి మాట్లాడుతూ.. 108, 104, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని.. వారి సమస్యలన్నింటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరుదు కల్యాణి.. నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయన్నారు. ఈ రోజు విశాఖలో లా విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. నిన్న బాపట్లలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హోంమంత్రి ఉన్న విశాఖలో కొద్దీ రోజుల కిందట హత్యాయత్నం చేశారు. ఈ రోజుకి హత్యాయత్నం చేసిన నిందితుడిని పట్టుకోలేదు. 

మండలిలో మంత్రులు అబద్దాలు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డి
మండలిలో మంత్రులు, టీడీపీ శాసన మండలి సభ్యులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. రుషి కొండ భవనాలను వైఎస్‌ జగన్‌ జగన్‌ వ్యక్తిగత భవనాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రుషి కొండ భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయని మంత్రే మండలిలో ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పరిశీలనలో కూడా అత్యుద్భుతం గా ఉన్నాయని చెప్పారు. రుషి కొండ భవనం ప్రభుత్వ భవనంగా ఉంటుందే తప్ప వైయ‌స్‌ జగన్‌ భవనం కాదు.

 రుషి కొండ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. 2017లో నిర్మించిన అసెంబ్లీ ఎస్‌ఎఫ్‌టీ 14000తో నిర్మించారు. కనీసం మంత్రుల రూమ్‌లో వాష్ రూమ్ కూడా లేదు.. వర్షం వస్తే కారిపోయే పరిస్థితి. అబద్దాలతో కాలక్షేపం చేయడం కాకుండా వాస్తవాలపై చర్చకు రండి.. చర్చిద్దామంటూ అప్పిరెడ్డి సవాల్‌ విసిరారు.

Back to Top