హంద్రీ–నీవాపై బహిరంగ చర్చకు సిద్ధం 

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ శివ‌రామిరెడ్డి స‌వాల్‌

చ‌ర్చ‌కు రాకుండా పారిపోయిన టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీ‌నివాసులు

అనంత‌పురం: హంద్రీ–నీవా కెనాల్‌ పనులు పూర్తి చేసిందెవరు? అందుకు ఎవరెంత నిధులిచ్చారో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రకటించారు. హంద్రీనీవా అభివృద్ధి పనులపై టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఛాలెంజ్ కు స్పందించి శివ‌రామిరెడ్డి ఉరవకొండ కు చేరుకున్నారు. హంద్రీ–నీవాకు శిలాఫలకం వేసిన ఉరవకొండలోనే బహిరంగంగా చర్చిద్దామని, తేదీ, సమయమెప్పుడో నిర్ణయించాలని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులుకు ఆయన ప్రతి సవాల్‌ విసిరారు. బహిరంగచర్చకు హాజ‌రుకాకుండా పోలీసులపై ఒత్తిడి తీసుకెళ్లి తమను  హౌస్‌ అరెస్ట్‌ చేయించొద్దని విజ్ఞప్తి చేశారు. మరో గంట అయినా ఇక్కడే వేచి ఉంటా మీరు తప్పకుండా  చర్చకు రండి అంటూ ఎమ్మెల్సీ ఛాలెంజ్ చేశారు. అయితే ఉరవకొండ బహిరంగ చర్చకు   టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హాజ‌రుకాలేదు. ఈ సంద‌ర్భంగా వై.శివ‌రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దివంగ‌త మ‌హానేత డాక్టర్ వైయ‌స్‌.రాజశేఖర్‌ రెడ్డి, మైసూరారెడ్డి సారధ్యంలో మొదలైన రాయలసీమ ఉద్యమంపై అప్పటి సీఎం ఎన్‌టీ.రామారావు స్పందించి హంద్రీ–నీవాకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. తిరిగి తొమ్మిదేళ్లు సీఎంగా కొనసాగిన చంద్రబాబు హంద్రీ–నీవాకు రెండుసార్లు శంకుస్థాపన చేయడం తప్ప సాధించిన ప్రగతి అంటూ ఏదీ లేదన్నారు. 2004లో వైయ‌స్‌.రాజశేఖర్‌ రెడ్డి సీఎం అయ్యాకనే హంద్రీ–నీవా పనులు వేగవంతమయ్యాయన్నారు. హంద్రీ–నీవా గురించి అన్నీ తెలిసిన కాలవ శ్రీనివాసులు నేడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీనీవాలో 6,300 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని, తిరిగి కూటమి ప్రభుత్వం 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి, మంత్రి కేశవ్‌కు, విప్‌ కాలవకు చిత్తశుద్ధి ఉంటే 10 వేల క్యూసెక్కులకు హంద్రీ–నీవా సామర్థ్యం పెంచేలా పనులు చేపట్టాలని సవాల్‌ విసిరారు.

తోకముడిచిన టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు 

హంద్రీనీవా ప్రాజెక్టు పై బహిరంగ చర్చకు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి స‌వాల్ విస‌ర‌గా, ఎక్కడైనా సరే చర్చకు వస్తానన్న టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తోక‌ముడిచారు.  ఉరవకొండ లో  హంద్రీనీవా శిలాఫలకం వద్ద 11 గంటలకు చర్చిద్దామని టీడీపీ ఎమ్మెల్యే కు సవాల్ శివ‌రామ‌రెడ్డి ఛాలెంజ్ చేయ‌గా, టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చ‌ర్చ‌కు రాలేదు. ఉరవకొండ లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శంకుస్థాపన చేసిన శిలాఫలానికి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. అయినా స‌రే ఎమ్మెల్సీ శివ‌రామిరెడ్డి గోడ దూకి వైయ‌స్ఆర్‌ శిలాఫలకం వ‌ద్ద‌కు వ‌చ్చి అక్క‌డ మ‌హానేత‌కు నివాళుల‌ర్పించారు. అక్క‌డి నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేకు శివరామిరెడ్డి ఫోన్ చేశారు. ఇప్పటికైనా హంద్రీనీవా ప్రాజెక్టు పై నిజానిజాలు తెలుసుకోవాలని ఆయ‌న హితవు. హంద్రీనీవా ప్రాజెక్టు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పుణ్యమే, మ‌హానేత చిత్తశుద్ధితో పనులు చేశారు కనుకే కృష్ణా జలాలు కరవు ప్రాంతాలకు వస్తున్నాయ‌ని చెప్పారు.  హంద్రీనీవా ప్రాజెక్టు కు రెండు సార్లు శిలాఫలకం వేసిన చంద్రబాబు నాయుడు ఆ త‌రువాత ప‌ట్టించుకోలేద‌న్నారు. ఈ విష‌యంపై బహిరంగ చర్చకు రాకుండా టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పారిపోయార‌ని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మీడియాకు వెల్ల‌డించారు.

Back to Top