కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి 

కేంద్రానికి తెలుగుదేశం ఎంపీలు  ఎందుకు లొంగి ఉంటున్నారో 

మనపై కేంద్రం ఆధారపడి ఉన్నా  ఎందుకు సాధించడం లేదు 

హెల్త్ సిబ్బందికి సంఘీభావం తెలిపిన  మాజీ ఎంపీ భరత్ 

రాజమహేంద్రవరం : నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్  డిమాండ్ చేసారు.  తమ డిమాండ్ల సాధన కోసం 24 రోజులుగా  రాజమండ్రి కలెక్టర్ వద్ద ఆందోళన చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను బుధవారం ఆయన ఆందోళన శిబిరానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు.  ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్పష్టంచేయడంతో పార్టీ తరఫున అండగా ఉంటామని భరత్  హామీఇచ్చారు. ఈ సందర్బంగా ఆందోళన కారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఆరేళ్ళు వర్క్ చేస్తే, పర్మినెంట్ చేసే పరిస్థితులు ఉన్నాయని అందుకే మీ డిమాండ్ కి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. మీ ఆందోళనకు తమ పార్టీ అండగా ఉండడమే కాకుండా ఆందోళనలో కూడా పాల్గొంటామని భరత్ వారికి  చెప్పారు .   గతంలో తాము అధికారంలో ఉన్నపుడు కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ ఉండేదని, అయితే ఎప్పుడు తెలుగుదేశం ఎంపీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందని అన్నారు. అయినప్పటికీ కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన తెలుగుదేశం ఎందుకు కేంద్రానికి లొంగిపోయి ఉంటోందో అర్ధం కావడం లేదని భరత్ వాపోయారు. 
   కరోనా నేపథ్యంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోడానికి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రభుత్వం తరపున ఏర్పాటుచేయాలని గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భరత్ చెప్పారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో కూడా మెడికల్ కాలేజీ మొదటి ఫేజ్ లోనే తీసుకొచ్చి ఎకడమిక్ కూడా స్టార్ట్ చేయించామని, మొదటి ఏడాది పూర్తయి రెండవ ఏడాదిలోకి కాలేజీ అడుగుపెట్టిందని ఆయన అన్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ లను కూడా తీసుకొచ్చిందన్నారు. అప్పట్లో కేంద్రానికి మన ఎంపీల మద్దతుతో పనిలేకున్నా సరే, పోరాడి సాధించామని అయితే ప్రస్తుతం కేంద్రం మన ఎంపీలపై ఆధారపడినప్పటికీ ఎందుకు సాధించలేకపోతున్నారని భరత్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పారని, మరి ఆ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అప్పులు చేసుకుంటూ పోతూ కూడా సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదని భరత్ విమర్శించారు.

Back to Top