తాడేపల్లి: రేషన్ డోర్ డెలివరీ నిలిపివేయడం దుర్మార్గమైన చర్యగా వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఏమన్నారంటే.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్‌ను డోర్ డెలివరీని నిలిపివేస్తూ చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా, అందులో రేషన్ డోర్ డెలివరీని నిలిపివేయడం ఒకటి. ఈ నిర్ణయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయి, చాలా దుర్మార్గమైన నిర్ణయం ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లను తొలగించి లక్షలాది మంది కుటుంబాలను కూడా వీధిన పడేసింది, వీరే కాదు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉన్న సహాయకులను కూడా తొలగించి వారి జీవనాధారం లేకుండా చేసింది. ఇంతేకాదు సచివాలయ వ్యవస్ధను నిర్వీర్యం చేసేలా అందులో ఉన్న ఉద్యోగులను కూడా రేషనలేజేషన్ పేరుతో కుదించింది. మేం అధికారంలోకి రాగానే లక్షల ఉద్యోగాలంటూ ఓట్లు దండుకుని తీరా ఇప్పుడు ఉన్న ఉద్యోగుల పొట్టకొట్టడం అత్యంత దారుణం. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, సమాధానం చెప్పాలి. రేషన్ వాహనాల వల్ల అవినీతి జరుగుతుందన్న ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత అవినీతి జరిగిందో చెప్పాలి, అంతేకాదు రేషన్ వాహనాలు తీసేసి రేషన్ పంపిణీ ఇక ముందు రేషన్ షాపుల ద్వారా మాత్రమే జరుగుతుందంటున్నారు, మరి రేషన్ షాపుల మీద 6ఏ కేసులు నమోదయ్యాయని ఆ షాపులు కూడా రానున్న రోజుల్లో ఎత్తేస్తారా? కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ దుర్మార్గపు నిర్ణయాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఎండీయూ ఆపరేటర్లకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.