వైయ‌స్ జ‌గ‌న్‌ వస్తేనే పేదలకు మేలు  

వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ సునీల్ కుమార్ యాదవ్  

ఏలూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తేనే రాష్ట్రంలోని పేద ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ సునీల్ కుమార్ యాదవ్  పేర్కొన్నారు. బుధ‌వారం ఏలూరులో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరీ సునీల్ కుమార్ యాదవ్, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు ఇన్చార్జ్ జయప్రకాష్, చింతలపూడి ఇంచార్జ్, కంభం విజయరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత రెడ్డి, జిల్లాలోని వివిధ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సునీల్‌కుమార్  మాట్లాడుతూ.. టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వ ఏడాది పాల‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర‌లేద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ  ఒక్క హామీ అమ‌లు చేయ‌డం లేద‌ని, ప్ర‌జ‌లను మ‌భ్య‌పెట్టేందుకు డైవ‌ర్ష‌న్ పొలిటీక్స్‌కు తెర లేపార‌న్నారు. రాష్ట్రంలో ఏడాదిగా ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం లేద‌ని, రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌పై కూట‌మి స‌ర్కార్ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని మండిప‌డ్డారు. గ‌తంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కులం, మ‌తం, ప్రాంతం, పార్టీలు చూడ‌కుండా అంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందించార‌ని గుర్తు చేశారు.  ఎన్నిక‌ల స‌మ‌యంలో ముస‌ల‌మ్మ కూడా బ‌ట‌న్ నొక్కుతుంద‌ని హేళ‌న చేసిన చంద్ర‌బాబు..ఇప్పుడెందుకు ఆయ‌న బ‌ట‌న్లు నొక్క‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. కుట్టు మిషన్ల పేరుతో రూ. 150 కోట్లు దోచేశార‌ని విమ‌ర్శించారు. మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు పార్టీ శ్రేణులు న‌డుంబిగించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

Back to Top