వైయస్ఆర్ జిల్లా: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, ఈ విషయం మీ సలహాదారుడు కూడా చెప్పలేదా అని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులు బలపడాల్సిన సమయంలో వాటిని నిర్వీర్యం చేయడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనన్నారు. వైయస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, ప్రజా సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేషన్ డీలర్లు పేదలకు సరిగా బియ్యం పంపిణీ చేయడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీ తెలిపారు. పేదలందరికీ రేషన్ బియ్యం అందాలన్నదే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే 8 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్‌కు సంబంధించి కోర్టు స్టే వెకెట్ చేయాలని ఏడాది కాలంగా కోరుతున్నా ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ గ్రిడ్ ప్రారంభించింది వైయస్ జగనే.. నియోజకవర్గంలో నిలిచిపోయిన వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని ఆర్డీవోను కలిసి కోరినట్లు తెలిపారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభించింది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఈ పథకానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వేంపల్లి, చక్రాయిపేట ప్రాంతాల్లో పాపాఘ్ని నది నీటి స్కీములు ఉన్నాయని, 148 పల్లెలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి నీరు అందించాలనే ఉద్దేశంతోనే వాటర్ గ్రిడ్ పథకం రూపొందించామని చెప్పారు. సీబీఆర్ పరిధిలోనే 146 నీటి స్కీములు ఉన్నాయన్న విషయం పాలకులకు తెలుసా అని ప్రశ్నించారు. బీటెక్ రవి మాటలన్నీ బోగస్ నీ పేరు ముందు ఉన్న బీటెక్ ఎంత బోగసో, నువ్వు చెప్పే మాటలు కూడా అంతే బోగస్ అని టీడీపీ నేత బీటెక్ రవిపై ఎంపీ అవినాష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నవారు సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుందని సూచించారు. 18 నెలల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఏ ఘనత సాధించిందో చెప్పాలని సవాల్ విసిరారు. 2025 సంవత్సరంలో రాత్రికి రాత్రే ముగ్గురై దొంగతనాలు జరుగుతున్నాయని, పాపాఘ్ని నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపించారు. కాలువ పరిధిలోని పొలాలు వర్షాలు వస్తే కోతకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దొంగతనాలు, మట్కా, జూదం వంటి అక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంలోనే కూటమి ప్రభుత్వం ఘనత సాధించిందని విమర్శించారు. ప్రతి మహిళకు రూ.18 వేల ఆర్థిక సాయం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం ఇస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని ప్రశ్నించారు. గతంలో 66 లక్షల పెన్షన్లు అందించగా, మీ ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల పెన్షన్లు తొలగించారని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు వస్తున్నాయంటే అది వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమేనని పేర్కొన్నారు. గండికోటలో ఐదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి ఉందని, ముప్పు గ్రామాలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి 26 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నామని తెలిపారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నట్లు వివరించారు. ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అందరికీ తెలుసునని అన్నారు. బోగస్ మాటలు పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని పాలకులను కోరారు. 18 నెలలుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి భరోసా కల్పించారు.