తాడేపల్లి: విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో విద్యారంగంలో వైయస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి. ఒకవైపు సర్‌ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్‌ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుంది?. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దు’ అంటూ కల్పలతారెడ్డి హితవు పలికారు.