తాడేపల్లి: కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి సృష్టిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఆర్‌టీఐ విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్ధి, ఉపాధ్యాయుల రేషియోలో అశాస్త్రీయ విధానం కారణంగా దాదాపు 10వేల మంది స్కూల్ అసిస్టెంట్‌లను సర్‌ప్లస్‌గా చూపే పరిస్థితిని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మిగులు టీచర్లను చూపుతూ, మరోవైపు డీఎస్సీలో కొత్త టీచర్ పోస్ట్‌లను ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. డీఎస్సీలో కూడా పోస్ట్‌లను తగ్గించేందుకే ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలను కక్షతోనే నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే... వైయస్ జగన్ ప్రభుత్వం ముందుచూపుతో విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ సంస్కరణలను కక్షసాధింపుతో నాశనం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తప్పుడు విధానాలతో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజుల నుంచి ఉపాధ్యాయులు రోడ్లమీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు తమకు రావాల్సిన డీఏలు, పీఆర్సీలు, ఐఆర్ కోసం కాదు, కేవలం విద్యారంగాన్ని బతికించాలంటూ వీధుల్లోకి వచ్చి పోరాడే పరిస్థితి కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల ఉనికిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్నారు. విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు గత ప్రభుత్వం తెచ్చిన జీఓ 117ని రద్దు చేయాలని, టీచర్ల బదిలీలపై చట్టం తీసుకురావాలని ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రైమరీ స్కూల్స్‌ను బలోపేతం చేసేందుకే 117 జీఓను రద్దు చేస్తూ, దానికి బదులుగా 19, 20, 21 జీవోలను తీసుకువచ్చామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ మూడు జీఓల్లో ప్రైమరీ స్కూల్స్‌కు ఎటువంటి మేలు జరుగడం లేదు. ఈ మూడు జీఓల్లో పేర్కొన్న దాని ప్రకారం తొమ్మిది రకాల స్కూల్స్‌ను తీసుకువచ్చారు. గతంలో ఆరు స్కూల్స్ ఉంటేనే, దానిని నాలుగు స్కూల్స్‌గా మారుస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ నేడు అదనంగా మరో మూడు స్కూల్స్‌ను కలిపి మొత్తం తొమ్మిది స్కూల్స్‌ను తీసకువచ్చారు. వీటిని కూడా సరైన విధంగా ఖరారు చేయలేదు. విద్యార్ధుల రేషియా కూడా హేతుబద్దంగా తీసుకోలేదు. ఉపాధ్యాయుల్లోనే దీనిపై ఒక అయోమయ పరిస్థితిని కల్పించారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్ గారు 3,4,5వ తరగతులను హైస్కూల్‌లో కలపడం వల్ల పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుందనే ఉద్దేశంతోనే 117 జీఓను తీసుకువచ్చారు. అలాగే టీచర్లకు పదోన్నతులు లభిస్తాయని భావించారు. దాదాపు ఏడువేల పదోన్నతులు ఉపాధ్యాయులకు లభించాయి. కానీ కూటమి ప్రభుత్వం ఈ జీఓను రద్దు చేసింది. దీనివల్ల స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ పోస్ట్‌ల విషయంలో అర్థం కాని గందరగోళం ఏర్పడింది. దాదాపు పదివేల స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లు మిగులుగా చూపుతున్నారు. ఇలా మిగులు పోస్ట్‌లుగా చూపే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? గతంలో వైయస్ జగన్ గారు టీచర్లకు పదోన్నతులు ఇస్తే, కూటమి ప్రభుత్వం వారికి డిమోషన్స్ ఇస్తోంది. ఈ పదివేల టీచర్ పోస్ట్‌లను సర్‌ప్లస్ గా చూపుతూ డీఓ, డీడీఓ పూల్, క్లస్టర్ పూల్ నుంచి తీసేసి, వీరిని సబ్జెక్ట్ టీచర్‌లు గా ఇస్తే పేద పిల్లలకు మేలు జరుగుతుంది. డీఎస్సీలో కొత్త పోస్ట్‌లకు ఎసరు పెడుతున్నారు ఇంతమంది సర్‌ప్లస్ టీచర్లను ఒకవైపు చూపుతూ, ఇప్పుడు డీఎస్సీ నిర్వహిస్తున్నారు. దాదాపు 7వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని అంటున్నారు. కానీ ఈ సర్‌ప్లస్ పోస్ట్‌లను చూపుతూ, కొత్త పోస్ట్‌లను ఎలా భర్తీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధులు, టీచర్ నిష్పతిని కూడా 1:53 గా చూపుతున్నారు. దీనిని తొలగించి 1:40 నిష్పత్తిగా చూపించాలి. అలాగే సెకండ్ సెక్షన్ కూడా హైస్కూల్‌కు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్‌లకు న్యాయం చేయాలి. అలా చేసినట్లైతేనే డీఎస్సీలో కొత్తగా ప్రకటించిన పోస్ట్‌లను భర్తీ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ డీఎస్సీలో పోస్ట్‌లను తగ్గించి, వాయిదా వేసే పరిస్థితి ఏర్పడుతుందని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎదురుకాకుండా ఉండాలంటే నిష్పత్తిని విద్యాహక్కు చట్టం ప్రకారం ఖరారు చేయాలి. సబ్జెక్ట్ టీచర్ లను పక్కకు పెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలి. దీనిపై కూటమి ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సమస్యలపై సమీక్షలు పెడుతున్నారు. కానీ సమస్యలు మాత్రం పరిష్కరించకపోగా, కొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. ప్రైమరీ మోడల్ స్కూల్స్‌లో స్కూల్ అసిస్టెంట్‌లను హెచ్‌ఎంగా పెట్టడం తప్పు. ఎస్‌జీటీలకే పదోన్నతులు ఇచ్చి హెచ్‌ఎంలుగా నియమించాలి. టీచర్ల బదిలీల్లో నిబంధనలకు నీళ్ళు టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. నలబైశాతం డిజైబులిటీ, బ్లైండ్ కేటగిరి వారిని ఫ్రిఫరెన్షియల్ కేటగిరిలో చూపించాలి. వారి విల్లింగ్ మేరకే బదిలీలు చేయాలి. వీటిని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు కోర్ట్‌కు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అన్ మ్యారీడ్ లేడీస్ కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరిలో ఉండేవారు, కానీ తాజాగా కూటమి ప్రభుత్వం 45 ఏళ్ళు దాటిన తరువాత 5 పాయింట్లు ఇస్తామంటున్నారు. ఇది కూడా సరికాదు. మహిళా ఉపాధ్యాయులకు ఉన్న వెసులుబాటును గౌరవించాలి. అలాగే జీఓ 342 జీఓ ప్రకారం స్టడీ లీవులో ఉన్న వారి పోస్ట్‌లను వేకెన్సీలుగా చూపించకూడదు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా బదిలీల్లో ఆ స్థానాలను ఖాళీగా చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులు ఉపాధ్యాయ లోకంలో ఆందోళనలు కలిగిస్తోంది.