తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదా అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్ (యర్రగొండపాలెం), మత్స్యరాస విశ్వేశ్వరరాజు (పాడేరు), బూసినె విరూపాక్ష (ఆలూరు), రేగ మత్స్యలింగం (అరకు). అయిదు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచకాలు, హత్యలు, దోపిడీ, మోసాలతో పాటు, వరసగా జరుగుతున్న అత్యాచారాలపై తాము అసెంబ్లీలో ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకోలేకనే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రభుత్వం అదే కోరుకుంటోందా?: సభలో తమను ఎదుర్కొనే సత్తా లేదా? లేక మీ దుర్మార్గాలు బయటపడతాయని భయపడుతున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన, సభలో రెండే పక్షాలు ఉన్నప్పుడు, విపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, సభలో విధిగా మాట్లాడే హక్కు లభిస్తుందని, అప్పుడే ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంతో పాటు, సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, స్పీకర్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదని, దాంతో హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. తమ పిటిషన్‌పై కోర్టు.. స్పీకర్ వివరణ కోరితే, కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని ఆక్షేపించారు. ఇప్పుడు కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు విపక్షాన్ని పిలవాలని.. కానీ తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు. అంటే ప్రతిపక్షం సభకు రాకూడదని కూటమి ప్రభుత్వం కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. 5 నెలలు. రూ.57వేల కోట్ల అప్పు: పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూటమి ప్రభుత్వానికి అయిదు నెలలు ఎందుకు పట్టిందని, ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే ఏకంగా రూ.57వేల కోట్ల అప్పు ఎందుకు చేశారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ నిలదీశారు. ఈ అయిదు నెలలుగా ప్రతి వ్యవస్థలోని అధికారులను తమ ఏజెంట్లుగా మార్చుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన, వాటిని ప్రశ్నిస్తామనే భయంతోనే తాము అసెంబ్లీకి రాకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. తాము రూ.14 లక్షల కోట్ల అప్పు చేశామని ఇన్నాళ్లూ చంద్రబాబు సహా, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో తేలిపోయిందని వెల్లడించారు. చివరకు అందులో సగం అప్పు కూడా చూపించలేకపోయారని ఆక్షేపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే..: తాము అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై తన అనుకూల ఎల్లో మీడియా ద్వారా సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తెలిపారు. సభలో తమకు మాట్లాడే అవకాశం వస్తేనే ప్రజా సమస్యలు ప్రస్తావించగలమని, ప్రతిపక్ష హోదా లేకుండా, సభలో మాట్లాడే అవకాశం రాదని.. అందుకే ఆ హోదా కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అంతే తప్ప సదుపాయాల కోసం కాదని తేల్చి చెప్పారు. అసలు 11 సీట్లు వస్తే, ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని చట్టంలో ఉంటే చూపించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్, ప్రజల గొంతుకై వ్యవహరిస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై బనాయిస్తున్న అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అలా ఇస్తామని ప్రకటిస్తే సభకు హాజరవుతామని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు వెల్లడించారు.