ఐదేళ్లలో పవన్‌  ఒక్కసారైనా చంద్రబాబును ప్రశ్నించారా?

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి

టీడీపీ, జనసేన పార్టీలు రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నాయి

చంద్రబాబు అవినీతిని పవన్‌ సమర్థిస్తున్నారా?

గత ఐదేళ్లు చంద్రబాబు, పవన్‌ కలిసి కాపురం చేశారు

మంత్రి బొత్స వ్యాఖ్యలను ఎల్లోమీడియా వక్రీకరించింది

రాజధాని రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు

లింగమనేని భూములను ఎందుకు భూసేకరణ కింద తీసుకోలేదు

పేదవాడి కోసం ఇసుకను తక్కువ ధరకే అందిస్తాం

తాడేపల్లి: టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతిని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏ నాడైనా ప్రశ్నించారా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి నిలదీశారు. రాజధాని విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించిందని తీవ్రంగా ఖండించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు.  తన మనసులో కర్నూలే రాజధాని అని గతంలో పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారని గుర్తు చేశారు.  

బొత్స సత్యనారాయణ ఏదో రాజధాని మార్చుతున్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఒక పసిబిడ్డలాంటి కొత్త రాష్ట్రాన్ని చంద్రబాబు చేతిలో పెడితే..ఆయన స్వర్థం కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన విషయాన్ని బొత్స సత్యనారాయణ బయటపెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే రాజధాని బాగుంటుందని ఒక కమిటీ వేస్తే..ఆ కమిటి చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. తుళ్లురు ప్రాంతం వరద ముంపునకు గురవుతుందని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో చెప్పిందని తెలిపారు. దాన్ని కూడా పెడ చెవిలో పెట్టి దేనికోసం చంద్రబాబు ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాజధానిని వాడుకున్నారని విమర్శించారు. ముందుగా నూజివీడు ప్రాంతంలో రాజధాని వస్తుందని చెప్పి అమాయకులను మోసం చేశారన్నారు. ఇక్కడేమో తన మనుషులతో భూములు కొనుగోలు చేయించారన్నారు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకోవద్దు అని చెప్పినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు నివాస ఏర్పాట్లు చేసిన లింగమనేని రమేష్‌కు మాత్రం భూసేకరణ నుంచి తప్పించారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఐదేళ్లు చంద్రబాబు ఒడిలో కూర్చొని ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలియదన్నారు. ఏ రోజైనా సరే రాజధానిలో జరిగే అవినీతిపై మాట్లాడారా అని ప్రశ్నించారు. విద్యుత్‌ స్తంభాన్ని ఏర్పాటు చేసేందుకు లక్షలు ఖర్చు చేసిన గత ప్రభుత్వాన్ని ఎందుకు ని లదీయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్లలో చేసిన అవినీతిని సమర్ధిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా చెప్పాలన్నారు.

వైయస్‌ జగన్‌ ఎక్కడా కూడా రాజధాని మార్చుతున్నామని చెప్పలేదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ కర్నూలు రాజధాని చేయాలని తన మనసులో మాటను బయటపెట్టారన్నారు. వందల ఎకరాలు విద్యా సంస్థలకు, పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు కట్టబెట్టారన్నారు. చంద్రబాబు సేకరించిన భూముల్లో కూలీలకు నివాస స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు చేశారా అని ప్రశ్నించారు. సుజనా చౌదరికి 600 ఎకరాలు కట్టబెట్టారన్నారు. నారాయణకు, చంద్రబాబు బంధువులకు అప్పన్నంగా భూములు ఇచ్చారన్నారు. రాజధాని ద్వారా రియల్‌ ఎస్టేట్‌ లాభాలు పేదలు అనుభవించకుండా అన్యాయం చేశారన్నారు. 
ఇసుక గురించి టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, గతంలో వారు ఇసుక పేరుతో దోచుకున్నది నిజం కాదా అని పార్థసారధి ప్రశ్నించారు. తక్కువ ధరకు వినియోగదారులకు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం నూతన పాలసీని తీసుకురాబోతుందన్నారు. ఇసుక మాఫియాతో వేల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతలు ఇవాళ ధర్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. వారం రోజుల్లో మెరుగైన ఇసుకను అందజేస్తామని చెప్పారు.కార్మికుల గురించి చంద్రబాబు ముసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అందరూ కూడా తలదించుకునేలా చేశారని విమర్శించారు. అసెంబ్లీకి సంబంధించిన పర్నీచర్‌, కంప్యూటర్లను దోచుకెళ్లి సొంతింట్లో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు సీ ట్యాక్స్‌, లోకేష్‌ ఎల్‌ ట్యాక్స్‌, కోడెల కే ట్యాక్స్‌ పేరుతో ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలని తపన పడుతున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలన్నారు.

 

Back to Top