విజయవాడ: చంద్రబాబు చేయని కుట్ర లేదు.. మార్చని మాటలేదని, అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే వ్యక్తి అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో అమరావతిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన 7,600 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందనున్నాయని చెప్పారు. పేదవాడికి సొంతిల్లు ఉండాలనే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇళ్లు కూడా నిర్మిస్తున్నారని చెప్పారు. సీఎం వైయస్ జగన్ పట్టుదల వల్లే అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు అందనున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూటి ప్రశ్న వేశారు. విజయవాడలో ఎంతమంది పేదలకు చంద్రబాబు 2 సెంట్ల స్థలం ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్మూ, ధైర్యం ఉంటే ఇళ్ల స్థలాలు తీసుకున్న లబ్ధిదారుల పేర్లు, నెంబర్లు ఇవ్వాలన్నారు.