తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజలు ఛీ కొట్టినా వారిలో మార్పురాలేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. ప్రజలంతా కరోనా బారినపడాలని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, లోకేష్ కోరుకుంటున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, యనమల దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన తీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన అప్పుల అప్పారావుగా చంద్రబాబు నిలిచిపోయాడన్నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. ఇచ్చిన ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తూ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సీఎం వైయస్ జగన్ పాలన చేస్తున్నారన్నారు. కరోనా టెస్టుల్లో ఏపీ నంబర్‌గా ఉందని నేషనల్ మీడియా చెబుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల కళ్లకు, ఎల్లోమీడియాకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. దేవినేని ఉమకు హెల్త్ ఎమర్జెన్సీ స్పెల్లింగ్ తెలుసా..? అని నిలదీశారు. కరోనా లెక్కలు దాస్తున్నారని తప్పులు ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు లెక్కలు చూపే నైజం చంద్రబాబు, టీడీపీదన్నారు.