బాబు, లోకేష్‌ స్పీకర్‌ కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలి

లేనిపక్షంలో క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతాం

స్పీకర్‌ను కించపరిచేలా టీడీపీ ఈపేపర్‌లో తప్పుడు కథనం

బీసీ వ్యక్తిగా ఉంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు..?

తండ్రీకొడుకుల తీరు అగ్రకుల అహంకారానికి పరాకాష్ట

స్పీకర్‌ను కించపరిచిన తీరుపై గవర్నర్‌ను కలుస్తాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

తాడేపల్లి: బలహీనవర్గాలు అంటే చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలకు ఎందుకంత చులకన..? బలహీనవర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్‌గా ఉంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన స్థానాన్ని కించపరిచేలా విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిందన్నారు. గౌరవ స్పీకర్‌ను కించపరిచే విధంగా టీడీపీ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లోని ఈ పేపర్‌లో కథనం రాశారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ స్పీకర్‌ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్‌ల తీరు అగ్రకుల అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ ఈపేపర్‌లో స్పీకర్‌ను ఉద్దేశించి వాడిన భాష సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందని ఎమ్మెల్యే జోగి రమేష్‌  అన్నారు. బలహీనవర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్‌ స్థానంలో కూర్చుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారని ప్రశ్నించారు. స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎన్నుకున్న సమయంలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు స్పీకర్‌ స్థానంలో కూర్చబెట్టేందుకు రాకుండా కించపరిచేలా ప్రవర్తించారన్నారు. చంద్రబాబు తీరు అగ్రకుల అహంకారానికి నిదర్శనమన్నారు. ‘2001లో గుడ్డలు ఊడదీసుకున్నావని, ఆంబోతులా తింటాడు.. నిద్రపోతాడు.. సాంబారు తాగివచ్చి దున్నపోతులా పడుకుంటాడు’ అంటూ స్పీకర్‌ను కించపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్, ఆయన పార్టీ వ్యవహరించిందన్నారు.

దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదదని, బలహీనవర్గాల వ్యక్తి స్పీకర్‌ స్థానంలో ఉంటే ఆయన్ను కించపరిచే విధంగా వార్తలు ప్రచురించినందుకు చంద్రబాబు, లోకేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ స్పీకర్‌ కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలన్నారు. లేకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. స్పీకర్‌ను కించపరిచే విధంగా వ్యవహరించిన తీరును గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

 

Read Also: వినయమే ఆభరణంగా వైయస్ జగన్ 

Back to Top