భారత్ బయోటెక్‌కు ఏజెంట్లుగా చంద్రబాబు అండ్ కో 

ప్రధానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ లేఖ రాస్తే బాబు, ఎల్లోమీడియాకు ఉలుకెందుకు..?

శ్మశానాల్లో శవాలను లెక్కలేస్తూ పైశాచిక ఆనందమా..?

నరరూప రాక్షసుడిలా నారా చంద్రబాబు వ్యవహారం 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ మండిపాటు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాస్తే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు,  ఎల్లో మీడియా ఎందుకు హైరానా పడిపోతున్నార‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి జోగి రమేష్ ప్రశ్నించారు. కోవాగ్జిన్ టెక్నాలజీ ఫార్ములాను వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం, అనుభవం ఉన్న మిగతా సంస్థలకు కూడా పంచి, కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలనే గొప్ప మనసుతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌ధానికి లేఖ రాశార‌న్నారు. ప్రజల ప్రాణాల కన్నా, తమకు భారత్ బయోటెక్ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా.. ఆ కంపెనీకి ఏజెంట్లుగా చంద్రబాబు అండ్ కో వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే జోగి రమేష్ మండి పడ్డారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యే జోగి ర‌మేష్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఇంకే ఏమన్నారంటే..

మానవాళికి, జాతికి పెను ముప్పు వాటిల్లినప్పుడు అందరూ కలిసి సమైక్యంగా ఎదుర్కోవాల్సిందిపోయి.. చంద్రబాబు, టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల ఎల్లో మీడియా శ్మశానాల్లో ఎన్ని శవాలు కాలుతున్నాయి, ఎంత మంది చనిపోతున్నారంటూ శవాల మీద చిల్లర ఏరుకునే వారిలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. 

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలూ శ్ర‌మిస్తున్నారు.  వ్యాక్సిన్ల కోసం ఎంతో ముందుచూపుతో ప్రధానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా పలురంగాల ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. మూర్ఖుడిలా చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ముఖ్య‌మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. శవాల దగ్గర డబ్బులు తీసుకునేవారికి, ఆసుపత్రుల్లో బెడ్ల కోసం రేట్లు ఫిక్స్ చేసి బ్రోకరేజ్ చేసేవారికి, రెమిడెసివర్ల ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించి డబ్బులు గుంజేవారికి, ఏమాత్రం తీసిపోము అన్నట్టుగా.. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే.. మరోవైపు చంద్రబాబు, ఎల్లో మీడియా కనీసం మానవత్వం లేకుండా భారత్ బయోటెక్ కు భజన చేస్తున్నాయి. 

భారత్ బయోటెక్ రామోజీరావు కొడుకు వియ్యంకుడిదైనంత మాత్రాన, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు కులానికి చెందిన వ్యక్తిది అయినంతమాత్రాన.. వీళ్ళంతా దానికి ఏజెంట్లుగా మారిపోయారా..? - శవాలు కాల్చే వ్యక్తులు, బ్లాక్ మార్కెట్ గాళ్ళ కంటే హీనంగా.. నారా చంద్రబాబు అండ్ కో తయారయ్యారంటే.. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది.

స్వాతంత్ర్యానికి పూర్వమే.. మన రాష్ట్రానికే చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ఎన్నోమహమ్మారి వ్యాధులకు మందులు కనిపెట్టి, అప్పట్లో కొన్ని లక్షల మందికి ఉచితంగా ప్రాణదానం చేశారు. ఫ్లేగు వ్యాధితో చనిపోతుంటే.. దానికీ ఔషధాన్ని కనిపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడారు తప్పితే.. ఫార్ములాకు హక్కుల కోసం ఆశపడలేదు. వాటికి పేటెంట్ కంటే మానవాళి రక్షణే తనకు ముఖ్యమని ఆయన చాటి చెప్పారు. అలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలే తప్పితే.. మనిషి మనుగడకే ఇంత పెద్ద ముప్పు వాటిల్లిన ఈ సమయంలో ఒక కంపెనీ కోసం చిల్లర రాజకీయాలు చేయడమా..? 

ఆక్సిజన్ కేటాయింపులు దగ్గర నుంచి వ్యాక్సిన్లు, మందులు సరఫరా, వీటి నియంత్రణ, పర్యవేక్షణ.. అన్నీ కేంద్రం పరిధిలోనే ఉన్నాయని తెలిసి కూడా ఈ డ్రామాలు ఏమిటి..? కేంద్రమే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో వ్యాక్సిన్లకు సంబంధించి సర్వ హక్కులూ తమవే అని చెప్పినా.. చంద్రబాబు, ఎల్లో మీడియా నిత్యం అవే ఆరోపణలు, అవే నింద‌లు వేస్తూ పైశాచిక ఆనందం ఎందుకు పొందుతుంది..? హైదరాబాద్ లో కూర్చుని నిత్యం జూమ్ లో కాన్ఫరెన్సులు పెడుతూ.. క్లిష్ట సమయంలోనూ ప్రజలకు అండగా నిలబడకుండా చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. 

మీకు చేతనైతే, ప్రజల మీద ఏ కొంచెమైనా ప్రేమ ఉంటే, మీ బంధువులది అయిన భారత బయోటెక్ ను ఒప్పించి వ్యాక్సిన్లు సరఫరా చేయించాలి. డబ్బులు కట్టడానికి, వ్యాక్సిన్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మానవాళికి ముప్పు వాటిల్లినప్పుడు.. ఒకే కంపెనీ నుంచి వ్యాక్సిన్లు తయారు చేయించి, కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే ఆ ఫార్ములాను మిగతా కంపెనీలకు బదిలీ చేస్తే.. ప్రజలకు త్వరితగతిన వ్యాక్సిన్లు అంది ప్రజల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా కంపెనీలను అడ్డం పెట్టుకుని తామే కోట్లు సంపాదించాలని, తమ వర్గం వారే బాగుపడాలని చూస్తున్నారు. 

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను రక్షించుకుంటుంటే..  ప్రజల ప్రాణాలు ఏమైనా ఫర్వాలేదు అన్నట్టు నరరూప రాక్షసుడిల్లా నారా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. వీళ్ళ ఆలోచన- ఎంతసేపటికీ శవాల మీద డబ్బులు ఏరుకోవాలి. చావుల మీద కోట్ల రూపాయలు సంపాదించాలి అనే. ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఓడించారని, ప్రజలపై ఎందుకు కక్ష..? ప్రజల్ని చంపాలన్న ఆలోచన‌ మీకెందుకు..?`` అని చంద్ర‌బాబుపై ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ధ్వ‌జ‌మెత్తారు.

తాజా వీడియోలు

Back to Top