వర్ల రామయ్యను బలి పశువును చేస్తున్న చంద్ర‌బాబు

మెజార్టీ లేకపోయినా ఎస్సీ నేతను కించపరచాలని నిలబెట్టావా..?

చంద్రబాబుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ధ్వజం

అమరావతి: దళిత నేత వర్ల రామయ్యను చంద్రబాబు బలి పశువు చేస్తున్నారని, రాజ్యసభ ఎన్నికల్లో గెలవలేరని తెలిసిన ఎందుకు బరిలోకి దించారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే మెజార్టీ లేకపోయినా ఎస్సీ నేతను కించపరచాలనే ఉద్దేశంతో నిలబెట్టినట్లుగా అనిపిస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్‌ ఆవరణలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు. మెజార్టీ సభ్యులు ఉన్న సమయంలో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను రాజ్యసభకు పంపించిన చంద్రబాబు.. బలం లేనప్పుడు ఎస్సీ నేత వర్ల రామయ్యను బరిలోకి దించారని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. 

గతంలో రాజ్యసభ సీటు ఆశ చూపి వర్ల రామయ్యను మోసం చేశాడని, మళ్లీ ఈ రోజు గెలవలేరని తెలిసి బరిలోకి దించి ఎస్సీ నేతను కించపరుస్తున్నాడని ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. చంద్రబాబుకు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలపై నిజంగా ప్రేమ ఉంటే ఆ రోజుల్లోనే రాజ్యసభకు పంపేవాడన్నారు. బలం లేదని తెలిసి కూడా ఇప్పుడు వర్ల రామయ్యను బరిలోకి దించి నీచ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. 

బలహీనవర్గాల బలం సీఎం వైయస్‌ జగన్‌
నాలుగు రాజ్యసభ స్థానాలు ఉంటే అందులో రెండు స్థానాలను బలహీనవర్గాలకు చెందిన వ్యక్తులకు కేటాయించిన అభినవ పూలే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. బీసీలను అత్యున్నత సభకు పంపిస్తున్నారన్నారు. అసెంబ్లీలో శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ చట్టం చేశారని, నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారన్నారు. బలహీనవర్గాల బలం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని జోగి రమేష్‌ అన్నారు.
 

Back to Top