చంద్రబాబు విశాఖకు చేసిందేమీ లేదు

చంద్రబాబు విశాఖకు చేసిందేమీ లేదు

విశాఖను అభివృద్ధి చేసింది మహానేత వైయస్‌ఆర్‌

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎల్లోమీడియా విషప్రచారం

కార్పోరేషన్‌ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చంద్రబాబు కుట్ర

తప్పుడు వార్తలపై నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు విశాఖపట్నంను వాడుకున్నారు తప్ప విశాఖ అభివృద్ధికి ఉపయోగపడలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖను అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో విశాఖపట్నం నగరానికి మంచిరోజులు రాబోతున్నాయని ఓర్వలేక చంద్రబాబు, ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం నగరానికి పులివెందుల నుంచి కొందరు వ్యక్తులు వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని చంద్రబాబు తోక పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వంపై విషప్రచారం చేయడానికి చంద్రబాబు, ఎల్లో మీడియా కంకణం కట్టుకున్నాయన్నారు. తప్పుడు వార్తలపై విశాఖ నగర కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేస్తామని హెచ్చరించారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విశాఖ నగరానికి ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. చెప్పుకోదగ్గ ప్రాజెక్టు నిర్మాణం టీడీపీ హయాంలో జరిగిందా..? అని ప్రశ్నించారు. విశాఖను అభివృద్ధి చేయకపోగా.. భూ కుంభకోణాలు చేసి లక్షల కోట్ల రూపాయలను చంద్రబాబు అండ్‌ కోటరీ దోపిడీ చేశారన్నారు.

విశాఖను అభివృద్ధి చేసిన నాయకుడు మహానేత వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. ‘అచ్చుతాపురంలో ఎస్సీజెడ్‌ తీసుకువచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించారు. బీహెచ్‌పీవీ లాంటి కంపెనీని నష్టాల్లో కూరుకుపోతుంటే దాన్ని బీహెచ్‌ఈఎల్‌లో విలీనం చేసి వేలాది మంది కార్మికులను కాపాడారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డు నష్టాల్లో కూరుకుపోతే దాన్ని డిఫెన్స్‌ నుంచి ఆర్డర్లు తీసుకొచ్చి కాపాడారు. రుషికొండకు ఐటీ కంపెనీలను తీసుకువచ్చారు. గన్నవరం పోర్టు, విమ్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం’ ఉన్నాయన్నారు.

మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాలను పునికిపుచ్చుకున్న సీఎం వైయస్‌ జగన్‌ విశాఖను అభివృద్ధి చేయాలని, బ్రాండ్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేయడానికి అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ అన్నారు. కొన్ని పత్రికలు, కొన్ని చానల్స్‌ ఇష్టారీతిగా విషప్రచారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, ఇటువంటి ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, పత్రికలపై విశాఖ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

Back to Top