పశ్చిమ గోదావరి: పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తే.. పవన్ కళ్యాణ్ టీడీపీతో సహజీవనం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. అయితే, చిరంజీవి ఎవరినీ మోసం చేయలేదు… కానీ, పవన్ అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అభిమానిగా పవన్ కల్యాణ్‌ని కోరేది ఒక్కటే.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని సూచించారు. శుక్రవారం గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుకు కావాల్సింది పెత్తందార్లు మాత్రమే.. పేదల కష్టాలు వారికి అవసరం లేదని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయి అంటున్న పవన్.. ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మంలో వెళ్లిన పవన్.. ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే ఆ రెండు చెప్పులు దొరుకుతాయి అంటూ ఎద్దేవా చేశారు.. పవన్ కల్యాణ్ ఎల్‌కేజీ లో చేర్పించేందుకు వయసు నిబంధన సడలిస్తు జీవో ఇవ్వమని ముఖ్యమంత్రికి విన్నవిస్తాను అంటూ సెటైర్లు వేశారు. పార్టీలు పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిది.. కానీ, పార్టీని ప్యాకేజీ కోసం అమ్మేయడం సరికాదని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో పవన్ కే అర్థం కాదు.. గుడ్డలు ఊడదీసి కోడతాను అనేది వైయస్ఆర్ సీపీకి ఓటు వేసిన వారినా..? లేక మిమ్మల్ని, చంద్రబాబుని ఓడించిన ప్రజలనా..? అని నిలదీశారు. కుటుంబానికి ఆధారంగా వుండే యువతకు పీకపిసికేయండి, మక్కేలు ఇరగకొట్టండి అంటూ రౌడీయిజం నేర్పిస్తున్నారు అంటూ పవన్‌పై గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి వారి జీవితాలు నాశనం చేయకండి అని సూచించారు. యువతకు ఎప్పుడైనా మంచి సలహా ఇచ్చారా.? సీఎం రాష్ట్రంలోని పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. తన సభకు వచ్చేవారిపై పవన్ కు అనుమానం.. అందుకే మీరంతా నాకు ఓట్లు వేయలేదని అవమానిస్తుంటారు అని విమర్శలు గుప్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ లా మీరు పాదయాత్ర చేయండి అని సూచించారు. జ్వరం అని చెబుతూ, సినిమాలకి డబ్బింగ్ పూర్తి చేసి మరోసారి అభిమానులను మోసం చేశారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. పవన్ చెబితే తెలుసుకోవాల్సినంత అమాయకులు కాదు భీమవరం వాళ్లు అని వార్నింగ్ ఇచ్చారు. నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పేటెంట్ రైట్ ఉన్నవాళ్లు, ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ రాసినవి పవన్ చదువుతున్నారు.. వెన్ను పోటు దారులు, భూ కబ్జాదారులు, మద్యం వ్యాపారాలు వంటివి చేసేవాళ్లు రాసినవి పవన్ చదువుతున్నారు అంటూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు.