ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి

వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం

కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమం.. గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లగం

మే నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలి

క్యాడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలి.. బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలి

బూత్‌ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి

జూలై 8న వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ

మన యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడా

టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
 

అమరావతి: ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని, దీని వల్ల గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లగల‌మన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభాపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.  

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

 ఈ సమావేశానికి పిలవడానికి ప్రధాన కారణాలు, ఉద్దేశాలు ఏమిటంటే... ప్రభుత్వం ఏర్పాటై దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. 34 నెలలు అయిపోయింది. మరో 2–3 నెలల్లో 
మూడు సంవత్సరాలుకూడా పూర్తి కావొస్తోంది. ఇక నుంచి పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆదిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. నా అనుభవంతో నేను చెప్తున్నాను... ఇంటింటికీ, గడపగడపకూ వెళ్లడం కన్నా.. మరే ఇతర ప్రభావవంతమైన కార్యక్రమం లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచి శాసనసభలో కూర్చోవాలంటే... కచ్చితంగా ఆ వ్యక్తి కనీసం మూడు సార్లు డోర్‌ టు డోర్‌ కార్యక్రమం చేయాలి. అప్పుడే సత్ఫలితానిస్తుంది.  కనీసం 2 సార్లు ప్రతి గడపకూ వెళ్లాల్సిన అవసరం ఉంది,  లేకపోతే ఎంతమంచి ఎమ్మెల్యే అయినా గెలవడం అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇంతకముందు మనం అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజు నేను చెప్పిన కొన్ని అంశాలను కూడ మరలా ప్రస్తావిస్తాను. 

ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉంది, 
అందుకే ఈ ఎల్పీ సమావేశం. మన ఇళ్లదగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మన ఇళ్ల దగ్గరకి వచ్చి మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్‌ పెట్టాలి.ఇక మనం గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.
ఏప్రిల్‌ మాసంలో ఉగాది రోజు నుంచి వాలంటీర్లకు సన్మానం చేస్తున్నాం. సేవా వజ్రాలు, సేవా మిత్రలు, సేవా రత్నాలు అని బాగా మంచి పనులు చేసిన వాలంటీర్లకు వారి సేవలకు అవార్డులు ఇస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి పారితోషకం కూడా ఇస్తున్నాం. మెడల్‌ కూడా ఇస్తున్నాం. గత సంవత్సరం కూడా మనం ఇది చేశాం. ఏప్రిల్‌ 2 ఉగాది రోజున  ప్రారంభమయ్యే  ఈ కార్యక్రమం నెలరోజులపాటు సాగుతుంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేదేమిటంటే.. కచ్చితంగా ప్రతి ఊరికీ వెళ్లి.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. 

గత ఏడాది కూడా వాలంటీర్లను సన్మానించాం. ఈసారి ప్రతి రోజూ 3–4 గ్రామాలు వెళ్లి.. వాలంటీర్లను గౌరవించే కార్యక్రమంలో పాల్గొనాలి. నెలరోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత మే నెల నుంచి నెలకు 10 సచివాలయాలు, అంటే నెలలో 20 రోజులపాటు ఎమ్మెల్యే తిరగాలి. అంటే  ఒక్కో గ్రామ సచివాలయానికి 2 రోజులు వెళ్లాలి. ఆ సచివాలయంలో ప్రతి ఇంటికీ తిరగాలి. ప్రతి ఇంటికి వెళ్లక మునుపే ఇంటింటీకీ ఏం మేలు జరిగిందనేది స్వయంగా ముఖ్యమంత్రిగారు రాసిన లేఖను అందించాలి. మీరే స్వయంగా ఆ లేఖను ఇచ్చి, ఆ మేలును గుర్తు చేయాలి. వారి ఆశీస్సులను పొందాలి.

ఈ గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు క్యాడర్‌ను ప్రజలకు
దగ్గర చేయాలి. క్యాడర్‌తో మీరు మమేకం చేయాలి. మళ్లీ బేసిక్స్‌లోకి వెళ్లి బూత్‌ కమిటీల ఏర్పాటు కూడా జరగాలి.
బూత్‌కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగాలి. ఆ తర్వాత వేరే సచివాలయానికి వెళ్లేముందు.. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, బూత్‌ కమిటీలు, ప్రతి ఇంటికీ వెళ్లి చేపట్టాలి.  నియోజకవర్గంలో డోర్‌–టు డోర్‌ పూర్తికావడానికి కనీసం 8 నెలలు పడుతుంది. నెలకు 10 సచివాలయాలు మాత్రమే పెట్టాం. మిగిలిన 10 రోజులు ఇతర కార్యక్రమాలు చేసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో రమారమి 80 సచివాలయాలు ఉండాయి అనుకుంటే... దాదాపు 8 నెలలు అయ్యేసరికి ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే వెళ్తారు. ఆ కుటుంబాల ఆశీర్వాదాలు తీసుకుంటారు. 

మరోవైపు మనం మే నెలలో సచివాలయాల సందర్శన ప్రారంభమయ్యే సరికి, జిల్లా, మండల,గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి. పర్యవేక్షణ కోసం మండల కమిటీ ఏర్పాటు చేస్తే.. గ్రామ కమిటీల పర్యవేక్షణ సులభం అవుతుంది. జిల్లా కమిటీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఎలాగూ యాక్టివేట్‌అవుతారు.  ఏప్రిల్‌ నాటికి కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలి. ఇవన్నీ సక్రమంగా జరగడానికి పర్యవేక్షణ కనిపిస్తుంది.
ఈ కమిటీల ఏర్పాటులో రీజినల్‌ కో–ఆర్డినేటర్లు చురుగ్గా వ్యవహరిస్తారు. కొత్త జిల్లాలు 26 అయిన నేపధ్యంలో  3–4 జిల్లాలకు రీజినల్‌ కో–ఆర్డినేటర్లు ఉంటారు. రమారమి 8 మంది వరకు పెరుగుతారు. కొత్త జిల్లాలను పరిగణ లోకి తీసుకుని రీజినల్‌ కో–ఆర్డినేటర్లను నియమిస్తాం. జిల్లా కమిటీలు అన్ని పూర్తి చేసుకుని.. జులై 8న ప్లీనరీ నిర్వహిస్తాం. 

ఇలా ఒకవైపున పార్టీ నిర్మాణం సాగుతోంది. మరోవైపున ఇప్పటికే 34 నెలలు పూర్తి చేసుకున్నాం. ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది.. ఇదే మాదిరిగా శాసనసభాపక్ష సమావేశం పెట్టి  రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరిస్తానని చెప్పాను.  దీంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. 
పార్టీ అనేది మీరు, నేను అందరం కలిసి నిలబెట్టుకున్న పార్టీ అని గుర్తు ఉంచుకోవాలి. మంత్రివర్గంలో నుంచి తప్పిస్తున్నట్టగా ఎవ్వరూ భావించవద్దు. ఇప్పుడు ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్షపదవులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు అవుతారు. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నాం. మంత్రులుగా పనిచేసినందున వారికి ప్రతిష్ట పెరిగింది అంతేకాదు, వారికి పార్టీని నడిపించే శక్తి ఉంటుంది. ఎవరైతే మంత్రివర్గంలో నుంచి వెళ్లి పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నారో వారందరికీ చెప్తున్నా..ఈ సిస్టం ఇలాగే కొనసాగుతుంది. మరలా మీరు గెలవండి, పార్టీని గెలిపించుకుని రండి.. మళ్లీ మీరు మంత్రులుకండి. ఈ విధానం ఇలాగే కొనసాగుతుంది.  పార్టీ బాధ్యతలు అనేవి.. ఈ విధానంలో ఒక భాగం.
ఇప్పుడు మంత్రులుగా వచ్చేవారు.. మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని సంతోషంగా తీసుకోవాలి. పార్టీ గెలిచి, పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి ఒక్కరూ మనమంతా కలిసి..తలా ఒక చేయి వేస్తేనే మనం గెలవగలుగుతాం, మళ్లీ అధికారంలోకి రాగలుగుతాం. ఒకవైపు చేయాల్సిన మంచి కార్యక్రమాలు చేస్తూనే... మరోవైపు పార్టీ పరంగా మనం చేయాల్సిన కృషి ఉంది.  ఎరినైనా మంత్రి పదవులనుంచి తప్పిస్తున్నానంటే.. వారికి మరింత బాధ్యత అప్పగిస్తున్నామని అర్ధం. తప్పుదు అనుకున్న చోట, కొన్ని సామాజిక సమీకరణాల వల్ల  కొన్ని కొన్ని మినహాయింపులు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉంటాయి. ఈ  26 కొత్త జిల్లాలకు కూడా ప్రతి 3–4 జిల్లాలకు ఒక రీజనల్‌ కోర్డినేటర్‌ ఉంటారు. మిగిలిన వాళ్లు అన్ని జిల్లాకు అధ్యక్షులగా తీసుకుంటాం. వీరు ఇంతకముందు నేను చెప్పిన పార్టీ వ్యవస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. వాళ్లు చేయడమే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యే చేసేటట్టు పర్యవేక్షిస్తారు. 

ఒక్కమాట స్పష్టం చెప్తున్నాను. డోర్‌ టు డోర్‌ చేయకపోతే.. సర్వేల్లో మీ పేర్లు రావు. సర్వేలలో మీ పేరు రాకపోతే మొహమాటం లేకుండా మీకు టిక్కెట్లు నిరాకరిస్తాను. మనం గెలవాలి.. అది మరిచిపోవద్దు. ఎందుకంటే... జుట్టు ఉంటేనే ముడేసుకోవచ్చు.. లేకపోతే.. ఎలా?. గెలవదగ్గ పరిస్థితుల్లోకి ప్రతి ఒక్కరూ పోవాలి.

కోవిడ్‌ వచ్చినందు వల్ల ... ఇంతకుముందుకన్నా.. ప్రజలకు కాస్త దూరంగా ఉండి ఉండొచ్చు. కోవిడ్‌వల్ల ఎవరి దగ్గరకు వెళ్లాలన్నా.. కష్టం అయ్యింది. ప్రజలు మనల్ని కలవాలంటే.. మన ఇంటికి రావాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మనం వెళ్లాలి. సంతృప్తకర స్థాయిలో కాలర్‌ ఎగరేసుకుని... మనం ఇదీ చేశాం అని చెప్పుకునే పరిస్థితి మనకు ఉంది. ఎవరికైనా ఫలానా పథకం కావాలన్నా.. ఇంకేదన్నా పారదర్శకంగా, సోషల్‌ ఆడిట్‌ ద్వారా సచివాలయంలో జాబితా ప్రదర్శించి... అర్హత  ఉన్న ఏ ఒక్కరికీ మిస్‌కాకుండా సగర్వంగా పథకాలు అందించాం. ఇది వాస్తవం.

చిరునవ్వుతో, ఆనందంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతాం. సంతృప్తి కలుగుతుంది. ఇంతమంది ప్రజల జీవితాలను మార్చగలిగామనే తృప్తి మనకు ఉంది.భవిష్యత్‌ తరాలు మన గురించి కచ్చితంగా చెప్పుకునేలా పనిచేశాం. రాజకీయనాయకులుగా మనకు కావాల్సింది ఇలాంటి తృప్తే.  శాచ్యురేషన్‌ విధానంలో నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. మనం నాలుగు అడుగులు ముందుకేశాం.  కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందించాం. 31 లక్షల ఇళ్లు జగనన్న కాలనీలు పేరుతో ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. మనం గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లగలం. ఇవే విషయాలను చెప్పాలి.

ప్రజల్లో ఎప్పుడైతే తిరగడం మొదలుపెడతామో... మంచిని కూడా చూడగలుగుతాం.  సచివాలయాలు తిరిగినప్పుడు వాటి పర్యవేక్షణ కూడా చేస్తారు. సలహాలు, సూచనలు ఇస్తే.. మీ దగ్గర నుంచి నా వరకూ తీసుకురావడానికి ఒక వ్యవస్థనుకూడా తయారుచేస్తాం. మీరు వెళ్లేటప్పటికి ఆ వ్యవస్ధ కూడా తయారవుతుంది. మంత్రులు ఎవరైతే జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ కోర్డినేటర్లగా బాధ్యతలు తీసుకుంటారో వారంతా ఈ బూత్‌ కమిటీలు, గడప, గడపకు చేసే కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తారు. 
 ఎమ్మెల్యేలుగా ఉన్నవారి పనితీరును కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. చాలా ముఖ్యమైన అంశమిది. ఇక్కడ మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే.. రాబోతున్నది పరీక్షా సమయం. మరో 2 సంవత్సరాల్లో ఈ పరీక్షా సమయం రాబోతోంది. కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. మూడేళ్లు గడిచిపోయింది. ఈ రెండేళ్లలో మనం ఏం చేస్తామన్నది ముఖ్యం. మీరు ఎలా కనెక్ట్‌ అవుతున్నారు అన్నదాన్ని బట్టి... మనం చేసిన మంచిని ఎలా ప్రజల్లోకి తీసుకుపోయామన్నదాన్ని బట్టి ఉంటుంది. 
 ప్రజలకు చేసిన మంచిని తీసుకుని వెళ్లలేకపోతే అది మీ వ్యక్తిగత తప్పిదమే అవుతుంది. ఈ విషయాన్ని మాత్రం ఎవరు కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఎవరు పనితీరు చూపించకపోయినా ఉపేక్షించేది లేదు. పనితీరు సరిగ్గా లేకపోతే.. సర్వేల్లో పేర్లు రాకపోతే కచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ   అవకాశం ఇవ్వకూడదని కోరుతున్నా. మీకు తగిన సమయం ఇస్తున్నా.  ఇప్పటివరకూ ఎలా ఉన్నా? ఇకపై ముందుకు కదలాలి. అది మీరు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. 

ఏప్రిల్‌ 2, ఉగాది నుంచి మీరు వాలంటీర్లను కలవడం మొదలుపెడతారు. ప్రతి ఎమ్మెల్యేకూ రూ.2 కోట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక నిధికింద వాళ్ల చేతిలో పెడుతున్నాం. ఏప్రిల్‌ 1 నుంచి యాక్టివేట్‌ అవుతుంది. 
 
మీరు గ్రామాలకు వెళ్లినప్పుడు మరో రెండు మూడు ముఖ్యమైన అంశాలున్నాయి.  ప్రతి గ్రామంలో మన ప్రతినిధులు ఉన్నారు.
సర్పంచులు, వార్డు మెంబర్లు, బూత్‌కమిటీలు.., ఎంపీటీసీలు... వీరంతా ఉన్నారు. వీరందరికీ మంచి శిక్షణ అవసరం. 
తెలుగుదేశం చేస్తున్న అసత్య ప్రచారాలకు, ఆరోపణలకు గ్రామస్ధాయిలో సమర్ధవంతంగా తిప్పికొట్టాలి. అలా జరగాలంటే వీరందరికీ వారికి డైనమిక్‌గా ట్రైనింగ్‌ ఇవ్వాలి. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వెంటనే కౌంటర్‌ ఇస్తారు. దానికి కౌంటర్‌ ఆర్గ్యుమెంట్‌ వీరి ద్వారా వెళ్లాలి. 

మనం చేస్తున్న యుద్ధం కేవలం చంద్రబాబుతోకాదు. మనం యుద్ధంచేస్తున్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి ఉన్మాదులతో యుద్దంచేస్తున్నాం. అందరూ కలిసి ఒక్కటై ఉన్నారు. ఇంతమందితో కలిసి యుద్ధం చేస్తున్నాం. ఒక అబద్ధాన్ని నిజంచేసేందుకు ఇష్టమొచ్చినట్టుగా వక్రీకరిస్తారు. నానా ప్రయత్నాలు చేస్తారు. ఇన్ని మీడియా ఛానెల్స్‌ వీళ్ల దగ్గరే ఉన్నారు కాబట్టి గోబెల్స్‌ ప్రచారంతో బుల్డోజ్‌ చేస్తారు.

దీన్ని కౌంటర్‌ చేయడానికి మనం ఇంకా అలర్ట్‌గా ఉండాలి. ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను యాక్టివ్‌ చేయాలి. అది కూడా మీ కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలి. తెలుగుదేశం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాదనలు ఏకపక్షంగా వ్యతిరేకంగా, తప్పుడు వార్తలు, చంద్రబాబునాయుడుకి అనుకూలంగా అటువైపు వార్తలు వస్తే...  ఏది నిజమో దాన్ని కౌంటర్‌ చేస్తూ ఇటువైపు నుంచి కూడా ఆధారాలు, సాక్ష్యాలతో రావాలి. అది కూడా గ్రామస్ధాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలి. అలా వస్తేనే మన వాళ్లు కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతారు.  తప్పుడు ప్రచారాలను కౌంటర్‌ చేసే ఆయుధాలను కార్యకర్తల చేతిలో పెట్టాలి. వీరికి డైనమిక్‌ ట్రైనింగ్‌ ఉండాలి.  రాబోయే రోజుల్లో మరింతగా బురదజల్లే కార్యక్రమాలను చేపడతారు. ఏ స్ధాయిలోకి వ్యవస్ధలు దిగజారిపోయాయి అంటే... గతంలో నిప్పులేనిదే పొగరాదు అనేవారు. ఇప్పుడు నిప్పు లేకుండానే పొగ తీసుకు వస్తారు. 
ఏమీ లేకపోయినా.. ఏదో జరగుతుందనే భ్రమ కల్పిస్తారు.
అసత్య ప్రచారాలతో, గోబెల్స్‌ ప్రచారాలతో మనం యుద్ధంచేయాల్సి వస్తోంది. కాబట్టి మన కార్యకర్తలకు మన వెర్షన్‌ బలంగా తెలుసుండాలి. అదే మన బలం. వారిని ఆ దిశగా చైతన్యం చేయాలి. అది జరగాలంటే మీరు వారితో పూర్తిగా మమేకం కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. గ్రామంలోని 10 మంది కార్యకర్తలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. 

చివరిగా మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మామూలుగా మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తారు, ఆ మేరకు జాగ్రత్తగా ఉండాలి.

 

Back to Top