వైయస్ఆర్ జిల్లా: పార్టీ నాయకులు, క్యాడర్ ఎవరూ అధైర్య పడవద్దని, రాబోయే రోజులు మనవేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. అందరూ ఉత్సాహంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైయస్ జగన్ పులివెందుల పర్యటన గురువారం ముగిసింది. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రజా దర్భార్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు వైయస్ఆర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, శ్రేణులను కలిశారు. కార్యకర్తలు, అభిమానులను కలవడంతో పాటు వాళ్ళ నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అందరూ ధైర్యంగా ముందుకెళ్ళాలని సూచించారు. పార్టీ నాయకులు, క్యాడర్ ఎవరూ అధైర్య పడవద్దని, రాబోయే రోజులు మనవేనని, అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ఈ మూడు రోజులు పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైయస్ జగన్‌ను కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలు క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. మూడో రోజు బయలుదేరే ముందు కూడా తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి తిరుగు పయనమయ్యారు.