గుంటూరు: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఈ రోజున కోర్టులో లొంగిపోనున్నారు. ఈ క్రమంలో పార్టీపరంగా వారికి సంఘీభావం తెలిపేందుకు వైయస్ఆర్‌సీపీ నేతలు వెళ్లనుండగా పోలీసులు ఎక్కడిక్కడే గృహ నిర్బంధాలు విధిస్తూ ఎవర్ని బయటకు రాకుండా అడ్డుకుంటూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పోలీసుల తీరును వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చి బయటకు రావద్దంటూ అడ్డుకున్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకట్ట వేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని ఇంటి వద్ద అర్ధరాత్రి నుంచే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చి ఇంట్లోనే ఉండాలంటూ పోలీసులు నిర్బంధించారు. అద్దంకి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను ఆసుపత్రిలో నిర్బంధించారు. మరో సమన్వయకర్త గాదె మధుసూదన్ రెడ్డికి పోలీసుల నోటీసు ఇచ్చి పిన్నెల్లిని కలవకూడదు అంటూ హుకుం జారీ చేశారు. వరికూటి అశోక్ బాబు ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా సృష్టించారు. రాత్రి ఒకటిగంట కు వెళ్లి “రేపు బయటకు రావద్దు… పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తాం” అంటూ పోలీసులు అశోక్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. ఆయన బందువుల ఇంట్లో జరుగుతున్న కుటుంబ కార్యక్రమానికి వెళ్తున్న కుటుంబ సభ్యులను కూడా బయటకు వెళ్లకుండా నిలిపివేశారు. బాపట్లలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి నోటీసులు ఇచ్చారు. తాడికొండ సమన్వయకర్త , గుంటూరు డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) ను కంటెపూడి చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపేశారు. మాచర్ల వైపు భారీగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు వస్తున్నారన్న సమాచారంతో రచ్చమలపాడు అడ్డరోడ్డు వద్ద పోలీసులు బ్యారికేడ్లు, చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరును వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.