తాడేపల్లి: గుంటూరు జిల్లా తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైయస్ఆర్‌సీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లు మండిపడ్డారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు డాక్టర్ అశోక్, డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఒక గ్రామానికి రక్షిత మంచి నీటిని అందించలేని అసమర్థ పాలన రాష్ట్రంలో జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోయాయా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, గ్రామంలో పారిశుధ్య కారక్రమాల డ్రైవ్, మినరల్ వాటర్ సప్లయ్, జీజీహెచ్ ద్వారా అస్వస్తతకు గురైన వారికి నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఇంకా వారేమన్నారంటే... ● వైయస్ఆర్‌సీపీ గళమెత్తితే తప్ప ప్రభుత్వంలో చలనం : మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకి కూతవేటు దూరంలోనే ఉన్న తురకపాలెం గ్రామంలో మూడు నెలల్లోనే 40 మందికి పైగా మరణించడం రాష్ట్రాన్ని ఒక్కసారిగా విస్మయానికి గురి చేసింది. గ్రామంలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాం. మంచినీరు కలుషితమైన కారణంగానే ఈ మరణాలు సంభవించినట్టు ప్రాథమికంగా మేం ఒక అంచనాకు వచ్చాం. క్వారీ వ్యర్థాలతో నిండిన సంజీవయ్య గుంటలో నుంచి నీటిని గ్రామంలో సరఫరా చేయడం వల్లే ఈ నీటి కాలుష్యం జరిగిందన్నది క్లియర్‌గా తెలుస్తోంది. ఈ పాడుబడ్డ గుంట నుంచి నీటిని ఎందుకు సరఫరా చేశారో ప్రభుత్వం విచారణ జరిపాలి. వైయస్ఆర్‌సీపీ నుంచి మేం వస్తున్నామని తెలిశాకనే ప్రభుత్వం స్పందించింది. గ్రామంలో నీరు దొరకడం లేదు కానీ 5 బెల్ట్ షాపుల ద్వారా ఇంటింటికీ మద్యం విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. మద్యం అలవాటున్న వారికి ఇన్ఫెక్షన్ వేగంగా సోకి మరణాలు సంభవిస్తున్నాయి. బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తే బెల్ట్ తీస్తానని చెప్పే చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెబుతారు? కేవలం మానవ తప్పిదం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయనేది వాస్తవం. ఇంటింటికీ మినరల్ వాటర్ ఉచితంగా పంపిణీ చేయాలి. గ్రామంలో బెల్ట్ షాపులు తీసేయాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. మరొక్క ప్రాణం పోయినా ఊరుకునేది లేదు. మెడికల్ కాలేజీ ఆస్తుల మీద కన్నేసిన చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేసే పేరుతో తన వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దుర్మార్గమైన చర్యను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇలాంటి చర్యల కారణంగా పేదవాడికి నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ● కలుషిత నీటిని అందించడం వల్లే మరణాలు : పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు తురకపాలెంలో జరుగుతున్న అకాల మరణాలకు గల కారణాల గురించి అన్వేషించడానికి వైయస్ఆర్‌సీపీ డాక్టర్ల బృందం గురువారం గ్రామంలో పర్యటించడంతో పాటు మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామమంతా తిరిగి పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వాతావరణ పరిస్థితుల గురించి ఆరాతీశాం. చనిపోయిన వారంతా జ్వరంతో ప్రారంభమై అకస్మాత్తుగా తీవ్రంగా అనారోగ్యంపాలై ఆయాసంతో, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నారు. రెండు నెలల వ్యవధిలో గ్రామంలో 40 మందికి పైగా యువత, నడి వయసు వారు చనిపోయారు. కలుషితమైన నీరు, మట్టిలో నుంచి వచ్చే బ్యాక్టీరియా ద్వారా మెలిడియోసిస్ అనే వ్యాధి సోకి జ్వరంతో మొదలై కీళ్లు, కండరాల నొప్పులు, తీవ్రమైన ఆయాసంతో బాధపడుతూ వారం పదిరోజుల వ్యవధిలోనే మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా నీటిని తరలించడం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాకనే నీరు సరిపోక గత మూడు నెలలుగా ఈ క్వారీ గుంతల్లో నీటిని గృహ అవసరాల కోసం సరఫరా చేస్తున్నారని గ్రామస్తులే చెబుతున్నారు. గుంటూరు నగరానికి కూత వేటు దూరంలోనే ఉన్న ఈ గ్రామం నుంచే రోజుకు 45 లక్షల లీటర్ల నీటిని బోర్లతో తోడి ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నా, గ్రామస్తులకు మాత్రం క్వారీ గుంతల్లో కలుషితమైన నీటిని ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని తరలిస్తున్న గుంతలో కప్పలు తిరుగుతున్నాయి. గుంట నుంచి దారుణంగా దుర్వాసన వస్తోంది. ఆ నీటిని ఎలా తరలిస్తున్నారో అర్థం కావడం లేదు. తురకపాలెం గ్రామంలో జరిగిన మరణాలకు వైద్యారోగ్యశాఖ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. వైద్యారోగ్యశాఖ మంత్రి, వైద్యాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులెవరూ పట్టించుకోలేదు. ఈ సమస్య మీద నెల రోజుల క్రితమే బ తరఫున జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా వారు కూడా పట్టించుకోలేదు. గ్రామస్తులంతా మినరల్ వాటర్ కొని తాగుతున్నారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి సరఫరా చేసే నీటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న నీటిని ఖాళీ చేయించి దానికి సరఫరా నిలిపివేయాలి. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య బృందాన్ని కేటాయించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి. మరింత దారుణమైన విషయం ఏంటంటే గ్రామంలో మంచినీరు దొరక్కపోయినా ఐదు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఒకపక్క ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటే వైయస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం దారుణమని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ● కనీసం డెత్ రిజిస్టర్ మెయిన్‌టైన్ చేయడం లేదు : వైయస్ఆర్‌సీపీ డాక్టర్ వింగ్ అధికార ప్రతినిధి డాక్టర్ అశోక్ తురకపాలెం గ్రామంలో దారుణమైన పరిస్థితులతో అమాయకులు బలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. షుగర్ తో బాధపడే వారు ఈ మెలిడియోసిస్ వ్యాధి బారిన త్వరగా పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం అలవాటు కూడా ఇన్ఫెక్షన్ కి ఇంకో ప్రధాన కారణం. ఇలాంటి ప్యాట్రన్ తో చనిపోతున్నప్పుడు, ఇంత వేగంగా మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వంలో కదలిక లేదు. వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదు. విలేజ్ క్లీనిక్స్, గ్రామ సచివాలయాలు తదననుగుణంగా పనిచేయలేదు. కనీసం డెత్ రిజిస్టర్ మెయిన్‌టైన్ చేయకోవడం విస్మయానికి గురిచేస్తోంది. వారు సకాలంలో ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసుంటే ఇన్ని మరణాలు సంభవించేవి కాదు. ఇప్పటికైనా ప్రతి ఒక్క ఇంటినీ సందర్శించి వారికి టెస్టులు చేయాలి. ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాలని డాక్టర్ అశోక్ డిమాండ్ చేశారు. ● కలుషిత నీటిని తాగడం వల్ల బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది : గుంటూరు జిల్లా డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డాక్టర్ రవీందర్ రెడ్డి ఎందుకు చనిపోతున్నారో గుర్తించేలోపే గ్రామంలో దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. గ్రామంలోకి సరఫరా చేసే నీటిలో ఉండే బ్యాక్టీరియా కారణంగానే ఈ మరణాలు సంభవించాయి. చెప్పులు లేకుండా తడి నేలల్లో నడిచేవారిలో, కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. జ్వరంతో మొదలై ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చి వారం రోజుల వ్యవధిలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నారని డాక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. జర్నలిస్టుల ప్రశ్నలకు అంబటి రాంబాబు సమాధామిస్తూ... ● అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు : అంబటి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే ఓర్వలేక అంబటి రాంబాబు అవినీతి అంటూ ఎల్లో మీడియాలో నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, ఈనాడు చెరుకూరి కిరణ్, బీఆర్ నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల కన్నా అవినీతిపరులు ఎవరుంటారు..? ముందే రిపోర్టు తయారు చేసుకుని విజిలెన్స్ ఎంక్వయిరీ అంటున్నారు. దేనికైనా సిద్ధపడే నేను రాజకీయాల్లోకి వచ్చా. ఇలాంటి హెచ్చరికలకు, అరెస్టులకు నేను భయపడే ప్రసక్తే లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పేకాట, కోడిపందేల ఊసే లేదు. అయినా నేను పేకాట ఆడించానని తప్పుడు వార్తలు రాస్తున్నారు. తప్పుడు కేసులను న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటా. ఆ సమయమే వస్తే అరెస్టును కూడా ఎంజాయ్ చేస్తా. లోకేష్ రెడ్ బుక్‌కి నా కుక్క కూడా భయపడదు. అన్నింటికీ సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతాం. నా వెనుక నియోజకవర్గ ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైయస్ జగన్ గారు ఉన్నారు. వీరంతా నా వెంట ఉండగా ఎందుకు భయపడతాను..? కూటమి చేసే ఏ యుద్ధానికైనా నేను కూడా సిద్ధమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.