అనంతపురం: వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు వాటిని దోచుకోవడానికే పీపీపీ విధానం తీసుకొచ్చారని, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ట్రస్టు మోడ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడ్‌లోకి మారుస్తున్నారని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉచితంగా మెరుగైనా వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత నుంచి క్రమంగా తప్పుకునేందుకే సీఎం చంద్రబాబు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఎన్నికలప్పుడు ఫ్రీ మెడికల్ సీట్లని చెప్పిన బాబు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో వైయస్ఆర్‌సీపీ హయాంలో వైయస్ జగన్ శ్రీకారం చుట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గం. మొదటి విడతలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేయడమంటే ప్రజారోగ్యాన్ని వారి చేతుల్లో పెట్టడమే. విద్య, వైద్య రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లన్నీ ఉచితంగానే ఇస్తామని ఎన్నికలప్పుడు చంద్రబాబు ప్రచారం చేసుకున్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా ఏకంగా కాలేజీలనే పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నాడు. డాక్టర్లు కావాలన్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తున్నారు. పీపీపీ ముసుగులో వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తన వారికి కట్టబెట్టడంలో భాగంగానే చంద్రబాబు పావులు కదుపుతున్నారు. పీపీపీ ముసుగులో వేల కోట్ల అవినీతికి చంద్రబాబు తెరతీశారు. ఆర్థిక ఇబ్బందులున్నా మెడికల్ కాలేజీలు కట్టిన వైయస్ జగన్ కరోనాతో ఆర్ధిక ఇబ్బందులున్నా నాటి సీఎం వైయస్ జగన్ భగీరథ ప్రయత్నంతో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను కూడా మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ స్ధాయి వైద్యం అందించాలని వైయస్ జగన్ ఆలోచించారు. 5 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కూడా జరుపుకోగా, వాటిలోని 750 సీట్లతో క్లాసులు జరుగుతున్నాయి. మరో 5 మెడికల్ కాలేజీలు (పులివెందుల, మార్కాపురం, ఆదోని, పాడేరు, మదనపల్లె) 2024 నాటికి పూర్తి చేయాలని వైయస్ జగన్ సంకల్పించారు. ఎన్నికల నాటికి 50 నుంచి 60 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. వైయస్ జగన్ మళ్లీ సీఎం అయ్యుంటే అవన్నీ నేడు ప్రారంభోత్సవం జరుపుకొని వాటిలో క్లాసులు జరిగేవి. గిరిజన ప్రాంతమైన పాడేరు మెడికల్ కాలేజీని కేవలం 50 సీట్లకే పరిమితం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. మాజీ సీఎం వైయస్ జగన్ మీద కోపంతో 95 శాతం పూర్తయిన పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన సీట్లను వసతులు లేవని కారణం చూపించి వెనక్కిచ్చేశాడు. ఏడాదిలోనే రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి క్లాసులు ప్రారంభించలేకపోవడం దుర్మార్గం. కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు డబ్బుల కోసం వేధిస్తుంటే, ప్రభుత్వ వైద్యులు దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కాపాడారనే విషయం చంద్రబాబుకి తెలియదా? గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందక అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మెడికల్ పెనుగొండ, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు వైయస్ జగన్ శ్రీకారం చుడితే వాటినీ ఈ ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసింది. డోలి మోతలతో గిరిజనులు పడే ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఆరోగ్యశ్రీ హైబ్రిడ్ మోడ్‌తో తీవ్ర నష్టం పేదవాడికి సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీని ట్రస్ట్ మోడ్ నుంచి హైబ్రిడ్ మోడ్‌కి తీసుకెళ్లడం చంద్రబాబు చేస్తున్న మరో దుర్మార్గమైన చర్య. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏడాదిన్న పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ప్రజల ఆరోగ్యంపైన కూడా వ్యాపారం చేయాలని చంద్రబాబుకి నీచ బుద్ధి కలగడం బాధాకరం. మీ ఆరోగ్యానికి ప్రభుత్వ బాధ్యత తీసుకునే విధంగా మహానేత వైయస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు వంటి అద్భుతమైన స్కీం తీసుకొచ్చారు. దాన్ని మరింత అద్భుతంగా అమలు చేసిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు, గత 2014-19 మధ్య 1054 ప్రొసీజర్లకే ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందించేవారు. వైయస్ జగన్ ఆ ప్రొసీజర్ల సంఖ్యను 3257కి పెంచి పేదవాడికి అండగా నిలిచారు. నాణ్యమైన ఉచిత వైద్యాన్ని హక్కుగా అందించిన ఘనత దివంగత వైయస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌లకే దక్కుతుంది. గత ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో దాదాపు 40,78,000 మందికి ఆరోగ్యశ్రీలో వైద్యం అందించారు. వైద్యం చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కూడా పనులు చేసుకోలేని స్థితిలో ఉన్న 24.59 లక్షల మందికి వైయస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.1469 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు.