అసెంబ్లీ: శాసనమండలిలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అప్రజాస్వామికంగా వ్యవహరించి సభ నడిపారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏమన్నారంటే.. రూల్–90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒకరోజు ముందే నోటీసు ఇవ్వాలి. చైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణనలోకి తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా చైర్మన్ రూల్–90ని పరిగణనలోకి తీసుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్ట పాలుజేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు. యనమల రామకృష్ణుడిది పైశాచిక ఆనందం. టీడీపీ సభ్యులు వారి మాట వినకపోతే విధ్వంసం సృష్టిస్తామని బెదిరిస్తున్నారు. సభా సంప్రదాయాలు, నిబంధనలు వారికి అవసరం లేదు. చరిత్రలో దుర్దినం : మంత్రి కన్నబాబు టీడీపీ సభ్యులు సభా నిబంధనల్ని ఉల్లంఘించారు. మెజార్టీ ఉందని ఇష్టానుసారం వ్యవహరించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది దుర్దినం. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేష్ దాడికి దిగారు. సభలో ఫొటోలు తీసి లోకేష్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీనిపై కచ్చితంగా సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లోకేష్ విధానం సరికాదని చైర్మన్ కూడా చెప్పారు. మండలి నిరవధిక వాయిదా వెనుక యనమల ప్లాన్ ఉంది. మెజార్టీ ఉందని సభను అడ్డుకుంటున్నారు. డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయం. టీడీపీకి తప్ప ఏ ఇతర పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు. మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలు కోరాం. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. వాయిదా వేయడం శోచనీయం: చీఫ్ విప్ ఉమ్మారెడ్డి శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. టీడీపీ సభ్యులు కుట్రతోనే వచ్చారు. కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయం. టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించింది. గత సమావేశాల్లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారు.