ఆర్డీటీ ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త అంద‌రిది

ఉద్యమ కార్యాచ‌ర‌ణ‌పై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు చ‌ర్చ‌

అనంతపురం : ఆర్డీటీ ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త అని, ఇందుకోసం ఉద్యమాలు చేపట్టాలని అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి అన్నారు. సోమ‌వారం న‌గ‌రంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో ఆర్డీటీ పరిరక్షణకు భవిష్యత్ కార్యాచరణ గురించి  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ రంగయ్య, త‌దిత‌రులు సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా అనంత వెంక‌ట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ఆర్డీటీ సంస్థ వచ్చి దళిత, గిరిజనులతో పాటు బీసీలకు అండగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అలాంటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కుట్రతో నిధులు రానివ్వకుండా అడ్డుకుందన్నారు. దీని వల్ల పేదలకు నష్టం జరుగుతోందన్నారు. కనీసం కూటమి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్చ జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. తక్షణం నిధులు విడుదల చేసి ఆర్డీటీ పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు.  అఖిల పక్ష కమిటీ తీసుకున్న నిర్ణయాలకు తాము మద్దతు ఇస్తున్నామన్నారు. సేవ్‌ ఆర్డీటీ కోసం కేంద్ర కార్యాలయాల‌ ముట్టడి, రైలు రోకోలు, జాతీయ రహదారుల దిగ్భందం, జిల్లా బంద్‌, రాష్ట్రబంద్‌, చలో ఢిలీ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. ఆర్డీటీని కాపాడుకునేంతవరకు ఉద్యమాలు చేస్తామన్నారు.  సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్,  సీనియర్ నాయకులు కె.వి.రమణ, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు  ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top