తాయిలాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం

వైయస్‌ఆర్‌సీపీ నేత వసంత కృష్ణప్రసాద్‌

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

నిరుద్యోగ భృతి ఏమైంది

బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు..చేశారా?

 దాసరి జై రమేష్‌ గురించి మాట్లాడే అర్హత దేవినేనికి లేదు

గత మేనిఫెస్టో అమలు చేయలేదు
ఇప్పుడు కొత్త మేనిఫెస్టో పేరుతో హడావుడి

విజయవాడ: ఎన్నికల ముందు చంద్రబాబు తాయిలాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్‌ అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, ఇప్పుడు కొత్తగా మరో మేనిఫెస్టో కమిటీ అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. మంత్రి దేవినేని ఉమా స్థాయి మరచి విమర్శలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వసంత కృష్ణ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు.

కాలేజీ పిల్లలకు ఐ ప్యాడ్‌లు ఇస్తామన్నారని తెలిపారు. బెల్టుషాపులు రద్దు చేస్తామన్న హామీ నీటిముటలైందన్నారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. అలాంటిది ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. మళ్లీ కొత్త మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు చెప్పడం మరోసారి ప్రజలను మోసం చేసేందుకే అన్నారు. బతికున్న కోడికి ఈకలు పీకి ఆ తరువాత గింజలు వేసిన చందంగా ఇన్నాళ్లు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని కొత్త మేనిఫేస్టో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో రూ.10 వేలు, సెల్‌ ఫోన్‌ అంటున్నారని, రైతులకు రూ.1000 ఇచ్చి అన్నదాత సుఖీభవ అంటూ డ్రామాలాడుతున్నారన్నారు. వీరికి ప్రజలను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి 2009వ సంవత్సరం ఎన్నికలకు వెళ్లారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత చేసిన తొలి ఐదు సంతకాల సంగతి ఏమైందన్నారు.

దేవినేని ఓ కంత్రీ మంత్రి
మంత్రి దేవినేని ఉమా ఓ కంత్రీ నాయకుడని, ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని వసంత కృష్ణప్రసాద్‌ విమర్శించారు. మైలవరం మంత్రి దేవినేని ఉమా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాసరి జై రమేష్‌ వైయస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిస్తే ఉమా వెంటనే విమర్శలు చేశారన్నారు. జై రమేష్‌కు ఒక రోజు ముందు ఉమా ఫోన్‌ చేసి చంద్రబాబుతో సంది చేసేందుకు ప్రయత్నించారన్నారు. దేవినేని ఉమకు అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యారన్నారు. ఇతను స్థాయి మరచి రమేష్‌కు ఏదో చేయాలని చూడటం సిగ్గు చేటు అన్నారు. జై రమేష్‌పై ఆ మరుసటి రోజు విమర్శలు చేసిన దుర్మార్గుడు దేవినేని ఉమా అని విమర్శించారు. ఎన్‌టీ రామారావుపై చెప్పులు విసిరిన మీరు ఇప్పుడు అడ్డగోలు ప్రేలాపనలు చేస్తున్నారని అన్నారు. ఆ రోజు ఎన్‌టీ రామారావు పెట్టిన పార్టీలో రాముడు సంతతి పోయిందని..టీడీపీలో అందరూ రావణులే మిగిలారన్నారు.  దేవినేని ఉమా..నీవు ఎన్నిసార్లు మైలవరం వచ్చావని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. పేద ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన దేవినేని తాను పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న హడావుడిగా భూ బదలాయించి ఎందుకు డ్రామాలాడుతున్నావని నిలదీశారు. నిజమైన లబ్ధిదారులెవరో గుర్తించకుండా ఇంత హడావుడి చేయడం ఎంటని ప్రశ్నించారు. దేవినేని ఎంత హడావుడి చేసినా ఓటమి ఖాయమన్నారు. టీడీపీ ఎన్ని కొత్త హామీలు ఇచ్చిన ప్రజలు గుణపాఠం చెప్పడం తధ్యమన్నారు. 

 

Back to Top